TGSRTC Job Notification 2025: ‘ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్.. త్వరలోనే నోటిఫికేషన్’ ఎండీ సజ్జనార్
రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు..

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ వైస్ ఛైర్మన్ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ఈ పోస్టుల భర్తీ అనంతరం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. ఈ మేరకు ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ లాసెట్ 2025 దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే
తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. వీటి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగియగా.. దానిని ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తేదీ వరకు లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ బీ విజయలక్ష్మీ పేర్కొన్నారు. లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఏప్రిల్ 15వ తేదీఓ ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటనతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు మూడేండ్ల లాసెట్‌కు 21,483 మంది, ఐదేండ్ల లాసెట్‌కు 6,326 మంది, పీజీ లాసెట్‌కు 2,556 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6వ తేదీన లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.