TG TET 2025 Apllication Fee: టెట్ దరఖాస్తులు ప్రారంభం.. ఫీజులు చూసి గుడ్లు తేలేస్తున్న అభ్యర్ధులు!
యేటా రెండుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) నిర్వహిస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ మొదటి విడతకు ఏప్రిల్ 11న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 నుంచి అన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. జూన్‌లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి. అయితే టెట్ దరఖాస్తు ఫీజు చూసి అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు..

హైదరాబాద్, ఏప్రిల్ 16: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) మొదటి విడత నోటిఫికేషన్‌ను తెలంగాణ విద్యాశాఖ ఏప్రిల్ 11న జారీ చేసిన సంగతి తెలిసిందే. యేటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ మొదటి విడతకు ఏప్రిల్ 15 నుంచి అన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జూన్‌లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌జీటీ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1, ఎస్‌ఏ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 2 పరీక్ష రాయల్సి ఉంటుంది. పేపర్ 2లో రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఉదాహరణకు.. గణితం-సైన్స్, సాంఘికశాస్త్రం.. ఇంగ్లిష్, సాంఘికశాస్త్రం.. ఇలా రెండేసి చొప్పున పేపర్లు ఉంటాయి.
తెలంగాణ టెట్ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు చేస్తే రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించినట్లు ప్రకటనలో విద్యాశాఖ పేర్కొంది. అయితే గతంలో టెట్ ఫీజుకు మినహాయింపు ఇస్తామని పగల్భాలు పలికిన విద్యాశాఖ ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే గతంలో మాదిరి ఫీజులు నిర్ణయించడం గమనార్హం. దీంతో గత టెట్‌కు ఫీజు మినహాయింపు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. 2024 నవంబర్‌లో నిర్వహించిన టెట్‌కు మార్చిలో ఫీజులు చెల్లించిన వారికి మినహాయింపు ఇచ్చారు. గతంలో టెట్ రాయని 20 వేల మంది నుంచి మాత్రమే ఫీజు వసూలు చేశారు. ఇక ఇప్పుడు ఫీజు మినహాయింపు సంగతి పక్కనపెడితే కనీసం కొంతైనా ఫీజు తగ్గిస్తారని అభ్యర్ధులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా భారీ మొత్తంలో టెట్ రిజిస్ట్రేషన్ ఫీజును పెంచారు. పెంచిన ఫీజులను తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది టెట్‌కు దాదాపు రెండు లక్షల మంది పోటీపడే అవకాశం ఉంది. గత జనవరిలో జరిగిన 2024 టెట్ 2 పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. ఇందులో 83,711 మంది డీఎస్సీకి అర్హత పొందారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025.
- ఆన్‌లైన్ పరీక్షల తేదీలు: జూన్ 15 నుంచి 30 వరకు
- టెట్ ఫలితాల వెల్లడి తేదీ: జులై 22, 2025.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.