Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! నవ్వులపాలైన ఎస్‌ఐ బాబు..

దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే అరెస్ట్‌ చేసేందుకు వెళ్లాడు ఓ ఎస్ఐ. నిజమైన నిందితుడిని పట్టుకునేందుకు బదులు జడ్జి ఇంటికి అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనక తప్పు తెలుసుకుని నాలుక కరచుకున్నాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఎస్‌ఐ బాబును పైఅధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! నవ్వులపాలైన ఎస్‌ఐ బాబు..
SI raids judge house in UP
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 15, 2025 | 11:16 AM

లక్నో, ఏప్రిల్ 15:  ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 2012లో ఓ దొంగతనం జరిగింది. నిందితుడు రాజ్‌ కుమార్‌ అలియాస్‌ పప్పుకి నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను జారీ చేశారు. దీంతో ప్రకటిత నేరస్థుడిగా తీర్పు చెప్పేందుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 82 ప్రకారం చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ నగ్మా ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. అతని కోసం వెతకవలసిన ఎస్‌ఐ భన్వరిలాల్‌.. నిందితుడికి బదులు లీగల్ నోటీసు జారీ చేసిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నగ్మా ఖాన్ కోసం గాలింపు ప్రారంభించాడు. ప్రొక్లమేషన్‌ ఆర్డర్‌ను నాన్‌బెయిలబుల్‌ వారంట్‌గా భావించిన సబ్-ఇన్స్పెక్టర్ బన్వరిలాల్.. కోర్డు ఆదేశాల్లో పేర్కొన్న చిరునామాలో నగ్మా ఖాన్‌ లేరని రాసి, నివేదికను కోర్టుకు సమర్పించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 82 కింద నిందితుడు రాజ్ కుమార్‌కి బదులుగా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నగ్మా ఖాన్‌ను నిందితురాలిగా తప్పుగా పేర్కొని, ఆమె తన నివాసంలో కనిపించలేదని చెబుతూ కోర్టుకు నివేదించారు.

మార్చి 23న కేసు విచారణ సందర్భంగా ఫైల్‌ను సమీక్ష కోసం సమర్పించగా కోర్టు ఈ తప్పును గుర్తించింది. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారికి ఈ కోర్టు ఏమి పంపిందో, ఎవరు దానిని పంపారో, ఎవరిని పట్టుకోవాలని కోర్టు పంపిందో తెలియకపోవడం వల్ల ఈ గందరగోళం ఏర్పడినట్లు బార్ అండ్ బెంచ్ గుర్తించింది. దీంతో ఎస్‌ఐ బన్వరీలాల్ నాన్-బెయిలబుల్.. నిందితుడి స్థానంలో న్యాయమూర్తి పేరును రాసి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను సరిగ్గా చదవకుండా ఇటువంటి తీవ్రమైన తప్పిదం చేయడం ఓ పోలీసు అధికారిగా అతని పని తీరును ప్రతిబింబిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి నిర్లక్ష్య చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులకు హాని కలిగిస్తాయని అభిప్రాయపడింది. దీనిని భారీ విధి నిర్లక్ష్యంగా అభివర్ణించిన కోర్టు, విచారణ ప్రారంభించి ఇన్‌స్పెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ఉత్తర్వు కాపీని IG ఆగ్రా రేంజ్‌కు పంపాలని కోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.