Madhu Manjari Selvaraj : ఒక్క అడుగు..15 బావులకు జీవం పోసింది..ఆమె సేవను ప్రకృతే మెచ్చింది..ఇంతకు ఎవరామే!
ఆమె ఓ ఆర్కిటెక్ట్..ఆర్కిటెక్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది భవనాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫామ్‌హౌజ్‌లు.. కానీ ఇక్కడ ఓ ఆర్కిటెక్ట్‌కు వచ్చిన ఆలోచన భూగర్భంలో కూరుకుపోయిన బావులకు ప్రాణాలు పోసింది..మూగ జీవాల గొంతు తడిపింది. నీటి కోసం కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే మహిళల భారాన్ని తగ్గించింది. ఆమె వేసిన ఈ ఒక్క అడుగు 15 బావులకు జీవం పోసింది.

తమిళనాడు దిండుక్కల్ జిల్లాలోని చిన్నాళంపట్టి గ్రామానికి చెందిన మధు మంజరి ఓ ఆర్కిటెక్ట్..ఆమె కూడా అందరిలానే సిటీలో జాబ్ చేస్తూ పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్‌హౌజ్‌లను డిజైన్ చేసేది. మూడేళ్లపాటు ఓ ఆర్కిటెక్టర్ సంస్థలో ఉంద్యోగం చేసింది. మంచి జీతం, సిటీ కల్చర్ ఇలా మంచి లైఫ్ లీడ్ చేసింది.అంతా బాగానే ఉన్న ఎక్కడో ఏదో ఓ అసంతృప్తి. అప్పుడే ఆమె మనస్సు అక్కడ లేదని గ్రహించింది. ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు వాళ్లకు ఓ ప్రాజెక్టు వచ్చింది. అదే హైదరాబాద్‌లోని మెట్లబావిని పునరుద్దరించడం. ఎన్నో ఏళ్లనుంచి పాడుపడిపోయిన ఈ మెట్లబావిని వీళ్లు అద్భుతంగా పునరుద్ధరించారు.
అప్పుడే ఆమె పనిచేస్తున్న సంస్థ తమిళనాడులోని కుక్కూ సంస్థతలో భాగమని తెలుసుకుంది. తిరువణ్ణామలై సమీపంలోని సింగరపేటై ఉన్న ఈ సంస్థను సందర్శించింది. ఈ సంస్థ ఇక్కడి స్థానిక పిల్లలకు విద్య నేర్పేందుకు కృషి చేస్తోంది. దీంతో ఆమె తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆ సంస్థలో చేరింది. అక్కడి ప్రాంతాల్లో నీళ్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసింది. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే స్త్రీల భారాన్ని తగ్గించాలనుకుంది. అప్పుడే పాత బావుల్ని పునరుద్ధరిస్తే నీటి సమస్యను తగ్గించొచ్చనే నిర్ణయానికి వచ్చింది. కుక్కూ సంస్థకు చెందిన 15 మంది వాలంటీర్లతో కలిసి పురాతన బావులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టింది.
కానీ ఈమె చేయాలనుకున్న పని అంత సులువుగా కాలేదు..దానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పూడుకుపోయిన బావులను పునరుద్ధరిద్దామని వెళ్లిన వీళ్లకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని గ్రామాల్లో మూడనమ్మకాల కారణంగా ఎన్నో బావులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందువల్లే ఆ బావులను బాగు చేద్ధామని వెళ్లిన వీళ్లకు కొన్ని గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వారికి సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో బావులను పునరుద్ధరించడానికి రెండు, మూడు నెలల సమయం పట్టింది. కానీ కొన్ని గ్రామాల్లోని గ్రామస్థులు వాళ్ల ప్రయత్నాన్ని అర్థం చేసుకుని పనుల్లో తలో చేయి వేసేవారు. అలా సహాయం చేసిన వారికి కూలీ డబ్బులిచ్చేవాళ్లు. ఇలా బావులకు అయ్యే ఖర్చు కోసం కుక్కూ సంస్థ తరపున వీరు క్రౌడ్ ఫండింగ్ చేసేవారు. వీళ్లు పునరుద్ధరించే ఒక్కో బావికి సుమారుగా రూ.3లక్షల దాకా ఖర్చు అయ్యేది. ఇలా వీరు రెండేళ్లలో 15కుపైగా బావులను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది.
అయితే వీరు ఈరోడ్ జిల్లాలో ఉన్న ఒక బావిని పునరుద్దరించినప్పుడూ ఓ ఆసక్తికరణ సంఘటన చోటుచేసుకుంది. ఈబావి అడవికి దగ్గరగా ఉండడంతో పశువులు, అడవి జంతువులు ఇక్కడిని నీరు తాగడానికి వస్తుంటాయి. అయితే వాటికి నీళ్లు తాగేందుకు వీలుగా ఉండేలా బావిని నిర్మించాలని అక్కడి గ్రామస్తులు కోరారు. దీంతో వాళ్లు అర్చి లాంటి నిర్మాణంతో బావిని పునరుద్దరించారు. అయితే వీళ్లు ఆ బావిని ప్రారంభించడానికి ముందురోజు ఓ ఏనుగుల గుంపు వచ్చి అక్కడ నీళ్లు తాగి వెళ్లింది. దీంతో ఏనుగులే ఈ బావిని ప్రారంభించినట్టు అయ్యింది. మనం మంచి పనులు చేస్తే ప్రకృతి ఎప్పుడూ మనకు సహకరిస్తుందనడానికి ఇదొక నిదర్శనం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి