Visakhapatnam: ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య! 4 రోజుల్లోనే వరుస మరణాలు..
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు తాము ఎందుకూ పనికిరామని, తమకు జీవితమే వ్యర్ధం అని భావించి వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితాలు వెలువడి పట్టుమని నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే అరడజను విద్యార్ధులు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్ధిని తనువు చాలించింది..

మర్రిపాలెం, ఏప్రిల్ 15: రాష్ట్ర ఇంటర్ విద్యార్ధులకు గత శనివారం (ఏప్రిల్ 11) ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో పలువురు విద్యార్ధులు తాము ఊహించిన వాటికంటే బెటర్ మార్కులు రావడంతో ఎగిరి గంతులేస్తుంటే.. మరికొందరు విద్యార్ధులు పరీక్షల్లో తప్పి చింతిస్తున్నారు. దీంతో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు తాము ఎందుకూ పనికిరామని, తమకు జీవితమే వ్యర్ధం అని భావించి వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితాలు వెలువడి పట్టుమని నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే అరడజను విద్యార్ధులు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్ధిని తనువు చాలించింది. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో రెడ్డి కంచరపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక (17) నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. పరీక్షలు ఫలితాలు తాజాగా విడుదలకావడంతో అందరి మాదిరి గానే నిహారిక కూడా తన ఫలితాలు చెక్ చేసుకుంది. అయితే జువాలజీ సబ్జెక్ట్‌లో విద్యార్ధిని ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమవారం (ఏప్రిల్ 14) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి ఆమెను కిందకు దించే సమాయానికే ప్రాణాలు కోల్పోయింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం ఉమెన్ ఎస్సై దివ్యభారతి తెలిపారు.
తల్లిదండ్రులు మీ పిల్లలు జాగ్రత్త..
పరీక్షల ఫలితాలు వెలువడే సమయంలో విద్యార్ధుల తల్లిదండ్రులు వారిని వేయి కళ్లతో కనిపెట్టుకుని చూసుకోవడం మంచిది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనీ, తక్కువ మార్కులు వచ్చాయనీ.. కొందరు తెలిసీ తెలియని వయసులో చావు వైపు అడుగులు వేస్తుంటారు. తల్లిదండ్రులు, స్నేహితులు వీరికి తోడుగా, అండగా నిలిచి ధైర్యం చెప్పాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే మానసిక నిపుణులను సంప్రదించాలి.