10th Class Result Date 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలోనే పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల!
రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెల్లడించగా.. మరో వారం రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి చేసింది. విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ క్షణాలు మరికొన్ని రోజుల్లోనే దగ్గరపడనున్నాయి..

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంతవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షలకు మరో వారంలో తెరపడనుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అలాగే ఏప్రిల్ 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. ఈ పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సర్కార్.. ఇంటర్ విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతోపాటు ‘మిత్రా’ వాట్సప్ యాప్‌లో కూడా నేరుగా చెక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇదే మాదిరి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితలు కూడా వాట్సప్ ద్వారా నేరుగా చెక్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవగా నేటితో మూల్యాంకనం ముగిసే అకవాశం ఉంది. అనంతరం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి, చకచకాల ఫలితాల వెల్లడికి ఆ రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.