TS Inter Supply Exams 2025: రేపట్నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్ ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి..

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. మే 25న ఆదివారం కూడా పరీక్షలు యథావిధిగా జరగుతాయని, సెలవు ఉండదని స్పష్టం చేశారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించినట్లు తెలిపారు.
అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు, వెలుతురు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మే 22 నుంచి జరిగే ఈ పరీక్షలకు విద్యార్ధులు పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్‌లు తీసుకురాకూడదని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ పకడ్భందీగా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షలకు హాజరుకావచ్చని, హాల్‌టికెట్లపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. ఇక పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటాయని ఆయన తెలిపారు. మరోవైపు ఏపీలోనూ కూడా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభమైనాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




