AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PEN on Inter Memos: ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై ‘PEN’​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..

PEN Number On Inter Memos: ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల​ మెమోలపై విద్యార్థుల పర్సనల్​ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) ముద్రించాలని అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. పదకొండు అంకెల నంబర్‌ను ప్రతి విద్యార్ధి పరీక్షల హాల్‌ టికెట్‌తోపాటు పరీక్షల అనంతరం జారీ చేసే మార్కుల మెమోలపై కూడా ముద్రించనున్నారు..

PEN on Inter Memos: ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై 'PEN'​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..
PEN on Inter memos
Srilakshmi C
|

Updated on: Jul 24, 2025 | 2:38 PM

Share

హైదరాబాద్‌, జులై 24: కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా తీసుకువచ్చిన వన్‌ నేషన్‌- వన్‌ స్టూడెంట్‌ ఐడీ కింద ప్రతి విద్యార్థికి పర్సనల్‌ ఎడ్యుకేషన్‌ నంబర్ (పెన్‌) కేటాయించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిదే. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు దీన్ని చాలా వరకు అమలు చేస్తున్నాయి కూడా. పెన్‌ అనేది శాశ్వత విద్యా సంఖ్య. ఇది విద్యార్ధుల విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు వారితోనే ఉంటుంది. 11 అంకెల ఈ పెన్‌ నెంబర్‌ ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, రీసెర్చ్‌, అప్-స్కిల్లింగ్ వంటి వివిధ అభ్యాస దశలలో రిఫరెన్స్ నంబర్‌గా పనిచేస్తుంది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, లింగం, అధ్యయన వివరాలు ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర విద్యార్ధులు రాష్ట్రం లేదా దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినా వారిని ట్రాక్ చేయడానికి అధికారులకు ఈ నెంబర్‌ సహాయపడుతుంది. అడ్మిషన్‌తో పాటు, స్కాలర్‌షిప్, పరీక్ష, ఉపాధి మొదలైన వాటికి కూడా PEN ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) కంటే భిన్నమైనది. దేశంలో చదువుతున్న ప్రదేశంతో సంబంధం లేకుండా విద్యార్థులను ట్రాక్ చేయడంలో అధికారులకు PEN సహాయపడుతుంది. ఇది డ్రాప్ అవుట్‌లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చడంలో కూడా సహాయపడుతుంది. SSC, ఇంటర్‌ హాల్ టిక్కెట్లు, మెమోలపై కూడా PEN ముద్రించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా 2025-26 అకాడమిక్ ఇయర్‌లో ఇంటర్‌ విద్యలో కూడా PEN ముద్రించాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఇంటర్‌ విద్యాశాఖను ఆదేశించారు. అందులో భాగంగా పర్సనల్​ ఎడ్యుకేషన్ నంబరు (పెన్​)ను ఇంటర్‌ నామినల్‌ రోల్స్‌, హాల్‌ టికెట్లు, మార్కుల మెమోలపై కూడా ముద్రించనున్నారు. ఈ విధంగా నమోదు చేయడం వల్ల విద్యార్థుల చదువు పూర్తయ్యేంత వరకు వారి ప్రగతిని అధికారలు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.

మరోవైపు ఏకీకృత జిల్లా విద్యా వ్యవస్థ సమాచారం (యూడైస్‌) 2025-26లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వివరాలు పూర్తిగా నమోదు చేయనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఏకంగా 94,806 మంది విద్యార్థుల డేటా యూడైస్‌లో చేరలేదని సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌ తేల్చారు. దీంతో రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తి (GER) తక్కువగా ఉన్నట్లుగా కేంద్ర గణాంకాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది నుంచి ప్రతి ఇంటర్‌ విద్యార్ధి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. తెలంగాణలోని 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని 1.50 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో ప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.