AP Aided Schools: ఎయిడెడ్ బడుల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం..: పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో దిగొచ్చిన విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాల్లో..
అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో దిగొచ్చిన విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ నియామక ప్రక్రియ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతానికి కాకినాడలోని నవభారత్ హైస్కూల్‌లో పీఈటీ పోస్టులు 1, ఎస్‌ఏ/ పీజీటీ పోస్టులు 5, ఎస్‌జీటీ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మిగిలిన పాఠశాలల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్ లేదా సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్ తదితర ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకూ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల్సిందే.. విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల్లో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు కార్డు నమూనాను కాలేజీలకు పంపించారు. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు ప్రోగ్రెస్ కార్డులు, జనరల్‌లో ప్రథమ సంవత్సరం వారికి లేత పసుపు రంగు ప్రోగ్రెస్ కార్డులు, రెండో ఏడాది వారికి లేత నీలం రంగు ప్రోగ్రెస్ కార్డులను ముద్రించి, ఇవ్వాలని ఆమె సూచించారు. ఇందులో యూనిట్ టెస్టులు, త్రైమాసిక, అర్ధ వార్షిక, ప్రీఫైనల్ పరీక్షల మార్కులతోపాటు, విద్యార్ధుల హాజరు వివరాలనూ నమోదు చేయాలని సూచించారు. పరీక్షల అనంతరం కార్డుల్లో మార్కులు నమోదు చేసిస్తే.. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సంతకాలు పెట్టించి, ఉపాధ్యాయులకు తిరిగి అందించాల్సి ఉంటుంది.