‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నట్లు..

హైదరాబాద్, జులై 3: వరుస వివాదాల నడుమ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET 2026 రీఎగ్జాం ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. నీట్ యూజీ 2026 రిగ్జాం ఫలితాలను జూలై 20లోపు ప్రకటించనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) తాజాగా వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో జూన్ 21న మళ్లీ దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్టులో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌టీఏ సీనియర్ అధికారి తెలిపారు.
ఓ వైపు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుండగా.. జూన్ 25న విడుదల తాత్కాలిక ఆన్సర్ కీని ఎన్టీయే విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దాదాపు 10 వేల అభ్యంతరాలు అందాయని, వాటిని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి సవాలును ఆధారాలతో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సరైన అభ్యంతరం నమోదు చేసిన అభ్యర్థులకు చెల్లించిన ఫీజును తిరిగి రిఫండ్ చేస్తామని వెల్లడించారు.
నీట్ ఫలితాల అనంతరం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, జిప్‌మర్, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. రాష్ట్రాలు తమ 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. నీట్ రీ ఎగ్జాం నిర్వహించినప్పటికీ ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభంలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని, ఎప్పటి మాదిరిగానే ఎంబీబీఎస్ తరగతులు సరైన తేదీల్లోనే ప్రారంభం అవుతాయని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి సాధారణ షెడ్యూల్ ప్రకారమే వైద్య విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.




