AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSCలో 55% మార్కులతో పాస్.. మార్కుల మెమో ఆకారంలో కేక్‌ తెచ్చి సర్ప్రైజ్ చేసిన తల్లిదండ్రులు! వీడియో

Mumbai family celebrates son's 55% exam results: పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించిన కుమారుడిని నిరుత్సాహపరచకుండా, ప్రత్యేకంగా మార్కుల మెమో ఆకారంలో కేక్ తయారు చేయించి సంబరాలు జరిపిన ముంబై కుటుంబం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. మార్కుల కంటే పిల్లల ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యమనే సందేశాన్ని ఈ కుటుంబం చాటి చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి పెంచడం కంటే వారిని ప్రోత్సహించడం అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

SSCలో 55% మార్కులతో పాస్.. మార్కుల మెమో ఆకారంలో కేక్‌ తెచ్చి సర్ప్రైజ్ చేసిన తల్లిదండ్రులు! వీడియో
Mumbai Family Celebrates Son's Class 10th Exam Results
Srilakshmi C
|

Updated on: Jun 29, 2026 | 6:00 AM

Share

పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనే ప్రశంసలు, సంబరాలు కనిపించే ఈ రోజుల్లో ముంబైకి చెందిన ఓ కుటుంబం భిన్నమైన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించింది. తమ కుమారుడు 55 శాతం మార్కులు సాధించినప్పటికీ అతడిని నిరుత్సాహపరచకుండా, ప్రత్యేకంగా అభినందిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన మహ్మద్ జైద్ ఇటీవల తన పాఠశాల పరీక్ష ఫలితాలను అందుకున్నాడు. అతడు మొత్తం 500 మార్కులకు గాను 276 మార్కులు సాధించి 55 శాతం మార్కులు పొందాడు. అయితే మార్కుల శాతాన్ని చూసి నిరాశ చెందకుండా, అతని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మార్కుల మెమో ఆకారంలో కేక్ తయారు చేయించి సంబరాలు జరిపారు.

ఆ కేక్‌పై జైద్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, రోల్ నంబర్‌తో పాటు ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులను కూడా ముద్రించారు. ఇంగ్లిష్‌లో 57, మరాఠీలో 44, హిందీలో 56, గణితంలో 59, సైన్స్ అండ్ టెక్నాలజీలో 55, సోషల్ సైన్సెస్‌లో 49 మార్కులు వచ్చినట్లు కేక్‌పై ప్రదర్శించారు. కుటుంబ సభ్యులంతా హర్షధ్వానాల మధ్య జైద్‌ను అభినందించగా, అతడు ఆనందంగా కేక్ కట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వేలాది మంది స్పందించారు. మార్కుల కంటే పిల్లల ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యమని కుటుంబం చూపించిన విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ పదో తరగతి విద్యార్ధి కేక్‌ కటింట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు.

‘నాకు 84 శాతం మార్కులు వచ్చినా ఇలాంటి సంబరాలు జరగలేదు’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, ’10వ తరగతిలో 95%, ఇంటర్‌లో 94.8% మార్కులు సాధించినా నాకు ఇలాంటి గౌరవం దక్కలేదు’ అని మరో వ్యక్తి స్పందించాడు. చాలామంది తల్లిదండ్రులు కూడా ఈ కుటుంబాన్ని ప్రశంసిస్తూ ‘ప్రతి తల్లిదండ్రి ఇలానే ఆలోచించాలి’ అని అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచడం కంటే వారిని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కుటుంబ సభ్యురాలు రుక్సార్ పటేల్ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

‘నా బిడ్డకు వచ్చిన 55 మార్కులు నాకు 95 లేదా 85 మార్కుల కంటే గొప్పవి. అతడిని తిడుతూ బాధపెట్టడం కంటే, అతడిలో ఆత్మవిశ్వాసం పెంచాలని అనుకున్నాను. ఇతరులతో పోల్చి అతడు ఎప్పుడూ తక్కువగా భావించకూడదు. కఠినమైన మాటల వల్ల ఎంతో మంది పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల గురించి మనం వింటూనే ఉన్నాం’ అని ఆమె తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పరీక్షల ఒత్తిడి వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ కుటుంబం చేసిన ప్రయత్నం అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మార్కుల కంటే పిల్లల మనోధైర్యం, సంతోషం ముఖ్యమనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Follow Us