AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టమా.. దురదృష్టమా..? దారిలో రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం జరుగుతుంది..

రోడ్డుపై నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా డబ్బులు దొరికితే ఏం చేయాలి? వాటిని ఇంటికి తీసుకెళ్లవచ్చా? దేవుడి హుండీలో వేయాలా? లేక పేదలకు దానం చేయాలా? దొరికిన డబ్బుపై ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలు, ధార్మిక విశ్వాసాలు, పెద్ద మొత్తంలో నగదు దొరికితే పాటించాల్సిన బాధ్యతలు ఏంటో తెలుసుకోండి.

అదృష్టమా.. దురదృష్టమా..? దారిలో రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం జరుగుతుంది..
Found Money On Road Spiritual Insights
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2026 | 3:21 PM

Share

అప్పుడప్పుడు రోడ్డుపై నడుస్తున్నప్పుడు డబ్బులు దొరుకుతుంటాయి. కొంత మంది వీటిని తీసుకుంటారు.. మరికొందరు తీసుకోరు.. తీసుకున్నా దానం చేస్తుంటారు.. అయితే.. దారిలో అకస్మాత్తుగా డబ్బులు దొరికినప్పుడు, అది అదృష్టమా, దురదృష్టమా లేక దానిని ఎలా వ్యవహరించాలి అనే ధర్మ సందేహం చాలామందిని వెంటాడుతుంది. ఈ ప్రశ్న చుట్టూ అల్లుకున్న ఆధ్యాత్మిక, ధార్మిక కోణాలను లోతుగా పరిశీలించడం అవశ్యం. ధనాన్ని లక్ష్మీ స్వరూపంగా గౌరవించాలని బాల్యం నుండే నేర్పించినప్పటికీ, దొరికిన ధనం మూలం, దానిపై అంటిపెట్టుకుని ఉన్న శక్తి ప్రభావం (వైబ్రేషన్) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు, పండితులు పేర్కొంటున్నారు.

ధనమూలం, కర్మ ప్రభావం:

ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో భాగంగా ధర్మబద్ధంగా వచ్చిన ధనం (స్వయం కృషి, వారసత్వం, లాటరీ వంటివి) మనదిగా పరిగణిస్తారు. కానీ, రోడ్డు మీద దొరికిన ధనం మనది కాదు. అది వేరొకరిది. ఈ డబ్బు దొరికినప్పుడు కలియుగ లక్షణాలైన ధన వ్యామోహం ప్రభావంతో దానిని భగవత్ సంకల్పంగా భావించి తీసుకోవాలనే ఆలోచన కలగవచ్చు. అయితే, ఇక్కడ ఆధ్యాత్మిక వివేకం అవసరం. కలియుగంలో ధనం, కనకం, కన్య వంటివి కలిపురుషుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. భాగవతం ద్వాదశ స్కంధంలో లక్ష్మి, సరస్వతి, పార్వతిని కూడా విక్రయించే స్థాయికి కలియుగంలో వ్యాపార దృక్పథం పెరుగుతుందని పేర్కొనబడింది. అనగా, ధనంతో వ్యాపారం, విద్యను డబ్బుతో ముడిపెట్టడం, ఆహారాన్ని సైతం కేవలం డబ్బుతోనే పొందడం వంటివి కలి లక్షణాలు. ఈ నేపథ్యంలో, దొరికిన ధనం మనకు చేరువైనప్పుడు అది కలి లక్షణమని గుర్తించి జాగ్రత్త వహించడం ముఖ్యం.

ప్రాధాన్యత:

ప్రతి వస్తువుకూ, ప్రత్యేకించి ధనానికీ, దానిని పట్టుకున్న వ్యక్తి స్పందన స్వభావం, భావోద్వేగాలు అంటిపెట్టుకుని ఉంటాయని పేర్కొంటున్నారు.. ఉదాహరణకు, శవయాత్రల సమయంలో దుఃఖంతో విసిరిన నాణేలపై ఆ దుఃఖం వైబ్రేషన్లు ఉంటాయి. అలాగే, పోగొట్టుకున్న వ్యక్తి ఆవేదన, బాధలు ఆ డబ్బుపై ఆవహించి ఉంటాయి. ఇలాంటి డబ్బును మనం తీసుకున్నప్పుడు, ఆ ప్రతికూల శక్తి ప్రభావం (కలిపురుషుడి కర్మ) మనకు అంటుకునే అవకాశం ఉంది. దీనికి ఒక ఉదాహరణగా, సంతోషంగా వండిన ఆహారానికి, విసుగుతో వండిన ఆహారానికి రుచిలో, ప్రభావంలో ఉండే తేడాని చెప్పబడింది. దేవాలయాల్లో భగవన్నామ స్మరణతో వండిన ప్రసాదానికి అపారమైన శక్తి ఉంటుంది. అదేవిధంగా, డబ్బుకూడా దాని పూర్వ అనుభవాల నుండి వైబ్రేషన్లను గ్రహిస్తుంది.

గురువుల బోధనలు, ఆచరణాత్మక పద్ధతులు:

గురువులు ధార్మికంగా వచ్చిన ధనాన్ని వేరే సంచిలో పెట్టి, వ్యక్తిగత అవసరాలకు ఇంట్లో డబ్బులు లేకున్నా దాన్ని వాడకుండా, ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చుకుని వాడుకోవాలని బోధించారు. ఎందుకంటే దాత ఇచ్చిన ధనానికి వారి సంకల్పం, వైబ్రేషన్లు ఉంటాయి. అదేవిధంగా, రోడ్డు మీద దొరికిన డబ్బు విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

దొరికిన డబ్బుతో చేయదగిన పనులు:

చిన్న మొత్తాల ధనం (రూ. 500-1000): ఇలాంటివి దొరికినప్పుడు వాటిని వెంటనే సమీపంలోని దేవాలయంలో హుండీలో వేయడం లేదా నిరుపేదలకు, బిచ్చగాళ్లకు దానం చేయడం మంచిది. ఇది కలిపురుషుడి దోషం అంటకుండా మనల్ని పవిత్రంగా, సురక్షితంగా బయటపడేస్తుంది.

పెద్ద మొత్తాల ధనం: వివాహం వంటి శుభకార్యాలకు తీసుకెళ్లేటప్పుడు పోగొట్టుకున్నవి దొరికితే, వాటిని వదిలేసి వెళ్లడం సరైనది కాదు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలి. “నాకు ఇంత డబ్బు దొరికింది, ఎవరైనా యజమానులు వస్తే వివరాలు పరిశీలించి ఇస్తాను” అని ఒక పత్రంపై రాసి పోలీస్ అధికారులకు అందజేయాలి. యజమానులు రాకపోతే, ఒక నెల లేదా రెండు నెలల తర్వాత, ఆ ధనాన్ని పుణ్యకార్యాలకు, ధర్మకార్యాలకు వినియోగించవచ్చు.

ఈ విధంగా రోడ్డు మీద దొరికిన ధనాన్ని వివేకంతో, ధార్మిక దృష్టితో వ్యవహరించడం ద్వారా దాని ప్రతికూల ప్రభావాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అలాగే ఇతరుల అవసరాలను కూడా మనం తీర్చవచ్చు..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు..

Follow Us