Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Police Jobs 2022: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ.. 7 లక్షలకు చేరువలో దరఖాస్తులు..

తెలంగాణలో భారీ ఎత్తున పోలీస్‌ నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 6.50 లక్షలు దాటాయి. పోలీసు శాఖలోని కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులతోపాటు ప్రత్యేక..

TS Police Jobs 2022: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ.. 7 లక్షలకు చేరువలో దరఖాస్తులు..
Tslprb Application
Follow us
Srilakshmi C

|

Updated on: May 17, 2022 | 4:32 PM

TSLPRB application last date 2022: తెలంగాణలో భారీ ఎత్తున పోలీస్‌ నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 6.50 లక్షలు దాటాయి. పోలీసు శాఖలోని కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులతోపాటు ప్రత్యేక భద్రతాదళం, అగ్నిమాపక, రవాణా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 2 నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభంకాగా మే 20వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు ముగిసేనాటికి మరో 1.50 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైన తొలిరోజే 15,000 దరఖాస్తులు నమోదు కావడంతో పోటీ అధికంగా ఉంటుందని మండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2018 ఉద్యోగ ప్రకటనలో 18 వేల ఉద్యోగాలకుగాను 7.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి నాలుగు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కానిస్టేబుల్‌ పోస్టులకు గట్టిపోటీ..! ఈసారి ఆరు నోటిఫికేషన్లలోని మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్‌ స్థాయిలోనివే కావడం గమనార్హం. మొత్తం పోస్టుల్లో అత్యధికం ఇవే కావడంతో పోటీ సైతం వీటికే నెలకొంది. ఈసారి కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి సుమారు 5-6 లక్షల దరఖాస్తులు వస్తాయని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) అంచనా వేస్తోంది. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో స్థానికత అంశం కీలకంగా మారింది.

ఓటీఆర్‌ రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదు.. ఇక పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (OTR) మాదిరిగానే తొలుత టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రాథమిక వివరాలతో మొదట రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పోలీసు ఉద్యోగాలకు కిందటిసారి (2018) నియామకాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువగానే దరఖాస్తులొస్తాయని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా సర్వర్లలో లోపం తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

వారందరూ ఓసీ కేటగిరిలోకి.. తెలంగాణ పోలీసు నియామకాల్లో పోటీపడే బయటి రాష్ట్రాల అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను నియామక మండలి వెల్లడించింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏ సామాజికవర్గానికి చెందినా.. వారిని ఓసీలుగానే పరిగణించనున్నట్లు పేర్కొంది. కొత్త ప్రెసిడెన్షియల్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో 5 శాతం మాత్రమే నాన్‌లోకల్‌ కేటగిరీగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ అయిదు శాతం కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుంది.

ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్‌ నంబర్‌ ఒకే అభ్యర్థి ఎస్సైతో పాటు కానిస్టేబుళ్ల కేటగిరీలో సివిల్‌, ఏఆర్‌.. తదితర విభాగాలకు పోటీపడే అవకాశముంటుంది. ఇలా ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా, అన్నింటిలోనూ ఒకే ఫోన్‌ నంబరు, ఒకే ఈ మెయిల్‌ ఐడీని పొందుపరచాలని మండలి స్పష్టం చేసింది. ఆ ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండాలని తెలిపింది. నియామకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీటికే పంపించనున్నారు.

రిజిస్ట్రేషన్‌లో తప్పును నమోదు చేస్తే అంతే సంగతులు.. రిజిస్ట్రేషన్‌ లేదా దరఖాస్తు నమోదు చేసే సమయంలో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తే, మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. వివరాలు తప్పుగా నమోదైతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకసారి చెల్లించిన రుసుమును ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను సెల్‌ఫోన్‌ ద్వారా దాఖలు చేయొద్దని మండలి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తప్పనిసరిగా కంప్యూటర్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచిస్తున్నాయి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ను వినియోగించడం ఉత్తమం.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.