AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఈ రాత్రితో ముగింపు!

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (JNVST 2027) తేదీ విడుదలైంది. తాజా ప్రకటన మేరకు నవోదయ ప్రవేశ పరీక్ష నవంబర్ 28, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు..

నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఈ రాత్రితో ముగింపు!
Navodaya 6th Class Admissions
Srilakshmi C
|

Updated on: Jul 31, 2026 | 2:46 PM

Share

హైదరాబాద్‌, జులై 31: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు జులై 31, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండబోదని జవహర్‌ నవోదయ విద్యాలయాల సంస్థ స్పష్టం చేసింది. కాగా ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 665 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు బాలబాలికలకు వేర్వేరు వసతి, ఆవాస సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

నవోదయ ప్రవేశ పరీక్ష (JNVST 2027) ఎలా ఉంటుందంటే..?

జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST 2027) పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకూ 1.25 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రంలో మెంటల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్‌ టెస్ట్ అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ వంటి ఇతర మాధ్యమాల్లోరూ ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్షలో అర్హత కోసం సెక్షన్ల వారీ కనీస మార్కులు పొందాలి. అంటే ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులు తెచ్చుకోవాలన్నమాట. మూడు సెక్షన్‌లలో సెక్షన్‌ 1లో 14 మార్కులు, సెక్షన్‌ 2, 3 ఒక్కో దాంట్లో 7 మార్కులు చొప్పున మార్కులు సాధించాలి. సమాధానం గుర్తించడానికి బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను ఉపయోగించాలి. ఓఎంఆర్‌ పత్రంలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది.

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సెక్షన్‌ 1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ ఒక్కో దాంట్లో 20 చొప్పున 40 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌ 2లో అరిథ్‌మెటిక్‌ 20 ప్రశ్నలు. వీటికి 25 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌ 3లో లాంగ్వేజ్‌ టెస్టుకి 20 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తారు. పరీక్ష ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో వెల్లడిస్తారు.

నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఏం ఉంటుందంటే?

మెంటల్ ఎబిలిటీ

ఈ విభాగంలో చిత్రాలు, రేఖలు, బొమ్మల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. మొత్తం ఐదు భాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగేసి ప్రశ్నలు ఉంటాయి. బొమ్మల్లో భిన్నమైనది గుర్తించడం, అసంపూర్ణ చిత్రాన్ని పూర్తి చేసే సరైన బొమ్మను ఎంచుకోవడం, చిత్రాల క్రమంలో తర్వాత వచ్చే బొమ్మను గుర్తించడం వంటి ప్రశ్నలు అడుగుతారు.

ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (EVS)

ఈ విభాగంలో నేచురల్ వరల్డ్, హ్యూమన్ బాడీ, సైన్స్ ఇన్ డైలీ లైఫ్, సోషల్ సరౌండింగ్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. రవాణా వ్యవస్థలు, నదులు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, ప్రకృతి విపత్తులు, ఆహారం, పోషకాలు, పరిశుభ్రత, ఆరోగ్య వ్యవస్థ, ఆహార భద్రత, కాలుష్యం, రాష్ట్రాలు–రాజధానులు, జాతీయ చిహ్నాలు, పండుగలు, కాలాలు, పంటలు, అడవులు, వస్త్రాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 15 ప్రత్యక్ష ప్రశ్నలతో పాటు ఒక పాసేజ్ ఇచ్చి దాని ఆధారంగా మరో 5 ప్రశ్నలు అడుగుతారు.

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అర్ధమెటిక్

ఈ విభాగంలో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. అంకెలు, కసాగు, గసాభా, వడ్డీలు, దత్తాంశాలు, భిన్నాలు, లాభనష్టాలు, నాలుగంకెల కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

లాంగ్వేజ్ టెస్టు

ఈ విభాగంలో విద్యార్థుల భాషా అవగాహన, పఠన నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. నాలుగు పాసేజ్‌లు ఇస్తారు. ప్రతి పాసేజ్ కింద ఐదేసి ప్రశ్నలు ఉంటాయి. పాసేజ్‌ను అర్థం చేసుకుని సరైన సమాధానాన్ని గుర్తించే విధంగా ప్రశ్నలు రూపొందిస్తారు. పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ప్రతి విభాగంలోని సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us