AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులు, ఓ కాలు లేకపోయినా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌! శీతల స్ఫూర్తిదాక కథ

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శీతల విశ్వకర్మ రెండు చేతులు, ఒక కాలు లేకుండా పుట్టినా తన వైకల్యాన్ని అడ్డంకిగా భావించలేదు. కాలి వేళ్లతో పెన్సిల్ పట్టుకుని రాయడం నేర్చుకుని, వీల్‌చైర్‌లో స్కూల్‌కు వెళ్తూ పదో తరగతిలో 92 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. భవిష్యత్తులో IAS అధికారిగా మారి అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించాలన్నది ఆమె లక్ష్యం..

చేతులు, ఓ కాలు లేకపోయినా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌! శీతల స్ఫూర్తిదాక కథ
Sheetal Vishwakarma Inspirational Story
Srilakshmi C
|

Updated on: Sep 29, 2026 | 5:19 PM

Share

జీవితంలో ఎదురయ్యే వైకల్యాన్ని చూసి వెనక్కి తగ్గకుండా.. పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శీతల విశ్వకర్మ. రెండు చేతులు, ఒక కాలు లేకుండా పుట్టిన ఆమె.. చిన్ననాటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే చదువులో రాణిస్తోంది. పదో తరగతిలో ఏకంగా 92 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని కల్యాణ్‌పుర్ గ్రామానికి చెందిన హీరాలాల్ కుటుంబంలో నలుగురు పిల్లలు. వారిలో శీతల ఒక్కరే వైకల్యంతో జన్మించింది. రెండు చేతులు, ఒక కాలు లేకపోవడంతో చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. తమ కుమార్తె భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అయితే శీతలను ఇతర పిల్లలతో సమానంగా పెంచాలని వారు నిర్ణయించుకున్నారు. ఆమెకు ఎలాంటి లోటు అనిపించకుండా చూసేందుకు ప్రయత్నించారు. శీతల స్కూల్‌కు వెళ్లాలని కోరుకున్నప్పుడు తండ్రి హీరాలాల్ తొలుత కొంత ఆలోచించారు. ఎందుకంటే ఆమె సొంతంగా అన్ని పనులు చేసుకోలేని పరిస్థితి. అయినప్పటికీ కుమార్తెపై నమ్మకంతో ఆమె కోరికను నెరవేర్చారు.

కాలి వేళ్లతోనే రాయడం నేర్చుకుంది

పెన్సిల్‌ను చేతులతో పట్టుకోలేని శీతల.. కాలి వేళ్లతో పెన్సిల్ పట్టుకుని రాయడం నేర్చుకుంది. అక్షరాలను సరిగ్గా రాయడానికి ఆమెకు సుమారు ఆరు నెలలు పట్టింది. అయితే పట్టుదలతో సాధన చేస్తూ చివరకు రాయడంలో నైపుణ్యం సాధించింది. ఆ తర్వాత వీల్‌చైర్‌లో స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న శీతల ఇంటి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లేది. తల్లి కొంత దూరం వరకు తీసుకెళ్లగా.. మిగతా దూరాన్ని స్నేహితుల సహాయంతో చేరుకునేది.

శీతల కేవలం చదువులోనే కాకుండా ఇతర కార్యకలాపాల్లోనూ చురుకుగా ఉంటుంది. బొమ్మలు వేయడం, వ్యాసరచన, వీల్‌చైర్‌లోనే డ్యాన్స్ చేయడం వంటి వాటిలోనూ తన ప్రతిభను చూపుతోంది. తన వైకల్యం ఎదుగుదలకు అడ్డంకి అని ఆమె ఎప్పుడూ భావించలేదు. ఫలితంగా పదో తరగతిలో 92 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. జిల్లా స్థాయి టాప్ ర్యాంకుల్లోనూ చోటు సంపాదించింది.

ఇవి కూడా చదవండి

‘తలరాతను మనమే మార్చుకోవచ్చు’

తన జీవితంపై శీతల ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతోంది. ‘నాకు చదువుకోవడమంటే ఇష్టం. నాలాంటి వాళ్లు దేవుడు మనల్ని ఇలా పుట్టించాడు అని బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో ప్రయత్నిస్తే మన తలరాతను మాత్రం మనమే మార్చుకోవచ్చు.’ తన మాటలను కేవలం చెప్పడమే కాకుండా.. ఆచరణలో చూపిస్తున్నానని శీతల చెబుతోంది. భవిష్యత్తులో సివిల్ సర్వెంట్‌గా, ముఖ్యంగా IAS అధికారిగా పనిచేయాలన్నది శీతల లక్ష్యం. సమాజంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా పనిచేయాలని ఆమె కోరుకుంటోంది.

ప్రభుత్వ సహాయం

శీతల పట్టుదల, ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకున్న సూరజ్‌పుర్ జిల్లా కలెక్టర్ ఆమెకు ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘వైకల్యం ఎవరికైనా బాధ కలిగించవచ్చు. కానీ నేను దానినే నా బలంగా మార్చుకున్నాను. అమ్మానాన్నల తోడు నాకు ఉంది. అందుకే నా బలాల మీదే దృష్టి పెడతాను’ అని శీతల చెబుతోంది. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా.. వాటిని అధిగమిస్తూ చదువులో ముందుకు సాగుతున్న శీతల విశ్వకర్మ కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Follow Us