JEE 2024 Main Results: జేఈఈ మెయిన్ -2024 సెషన్‌ 1 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (బీఈ/బీటెక్‌/బీఆర్క్‌) ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 తొలి విడత (సెషన్-1) పరీక్ష ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 13) విడుదలయ్యాయి.సెషన్-1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్‌ ‘కీ’లను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) సోమవారం విడుదల చేసింది..

JEE 2024 Main Results: జేఈఈ మెయిన్ -2024 సెషన్‌ 1 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు
JEE Main 2024 Session 1 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2024 | 2:13 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (బీఈ/బీటెక్‌/బీఆర్క్‌) ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 తొలి విడత (సెషన్-1) పరీక్ష ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 13) విడుదలయ్యాయి.సెషన్-1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్‌ ‘కీ’లను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) సోమవారం విడుదల చేసింది. ఆ మరుసటి రోజే అంటే మంగళవారం ఫలితాలను వెలువడించింది. తొలి విడత పేపర్-1కు 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 11,70,036 మంది అంటే దాదాపు 95.8 శాతం మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించింది. ఈ పేపర్ పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్ 2024 తొలి విడత (సెషన్-1) పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జేఈఈలో మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్ధుల సత్తా.. 10 మందికి 100% పర్సంటైల్‌

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఈ రోజు విడుదలైన పేపర్‌-1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఇందులో 10 మంది విద్యార్ధులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి వెంకట తనీశ్‌రెడ్డి.. ఈ ముగ్గురు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. ఇక తెలంగాణకు చెందిన రిషి శేఖర్‌ శుక్లా, మదినేని వెంకటసాయి తేజ, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌, తవ్వ దినేశ్‌రెడ్డి, పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, హుందేకర్‌ విదిత్‌ అనే విద్యార్ధులు 100% పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు.

జేఈఈలో మెయిన్‌ చివరి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో వచ్చిన మార్కుల్లో గరిష్ఠంగా వచ్చిన మార్కులను అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 2024 ఏప్రిల్‌లో ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.