India Post Jobs: మీరూ టెన్త్ పాసైయ్యారా? రాత పరీక్ష లేకుండానే 21,413 తపాలా ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్!
కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎలాంటి నియామక పరీక్ష లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగా తపాలా ఉద్యోగాలకు ప్రకటన జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో 1215, తెలంగాణలో 519 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లుగా ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి..

ఎలాంటి నియామక పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్-2025) ప్రకటన విడుదలైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లుగా ఎంపిక చేయనున్నారు. అలాగే మార్చి 3, 2025 నాటికి 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసు సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు, దివ్యాంగులకు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్ధులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. గణితం, ఆంగ్లం, స్థానిక భాషల్లో తప్పని సరిగా నైపుణ్యం ఉండాలి. ఆయా పోస్టులను బట్టి సుమారు రూ.10 నుంచి రూ.29 వేల వరకు జీతం పొందవచ్చు.
తపాలా శాఖలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మార్చి 3వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు తుది గడువులోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. పదో తరగతి మార్కులు, ఆధార్‌కార్డు, ఫొటోలు, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిచేసిన అనంతరం జిల్లాలో ఉన్న ఖాళీల ప్రకారం ప్రాధాన్యత ఇస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 6, 2025 నుంచి మార్చి 8, 2025 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఈపోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1215, తెలంగాణలో 519 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఎంపికైన వారిని ఖాళీగా ఉన్న బ్రాంచీలు, హోదా ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




