AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT బాంబే పరీక్షల్లో ఫోన్‌తో పట్టుబడినా పరీక్ష రాసే అవకాశం.. చీటింగ్‌ చేస్తే ఇక కఠిన చర్యలు లేనట్లే?

పరీక్ష హాల్లో విద్యార్థి వద్ద మొబైల్‌ ఫోన్‌ కనిపిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా? లేక పరీక్ష పూర్తిచేసేందుకు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత అతడి వివరణ విని నిర్ణయం తీసుకోవాలా? ఈ అంశంపై ఐఐటీ బాంబే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొనే విద్యార్థుల విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని నిర్ణయించింది. పరీక్ష మధ్యలో ఫోన్‌తో పట్టుబడిన విద్యార్థి కూడా ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించడం, అనంతరం అతడి వాదన వినడం, అవసరమైతే కౌన్సెలింగ్‌ అందించడం వంటి మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది..

IIT బాంబే పరీక్షల్లో ఫోన్‌తో పట్టుబడినా పరీక్ష రాసే అవకాశం.. చీటింగ్‌ చేస్తే ఇక కఠిన చర్యలు లేనట్లే?
IIT Bombay Revises Malpractice Rules
Srilakshmi C
|

Updated on: Oct 23, 2026 | 3:59 PM

Share

ముంబై, అక్టోబర్‌ 23: ఐఐటీ బాంబేలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న సహిల్‌ రవీంద్ర వాకోడే సెప్టెంబరు 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అతడు.. మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలో మొబైల్‌ ఫోన్‌, చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ కథనం పేర్కొంది. తమ కుమారుడు కుల వివక్షను ఎదుర్కొన్నాడని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన అనంతరం క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల సంక్షేమం, క్రమశిక్షణ చర్యల విధానాలను సమీక్షించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పరీక్షల్లో అక్రమాల ఆరోపణలను ఎలా నమోదు చేయాలి? నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఇలాంటి ఘటనల తర్వాత విద్యార్థులకు ఎలాంటి మానసిక సహాయం అందించాలి? అనే అంశాలను పరిశీలించేందుకు ఐఐటీ బాంబే ఎనిమిది మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నలుగురు అధ్యాపకులు, నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ కమిటీ అక్టోబరు 7న జరిగిన ప్రత్యేక సెనేట్‌ సమావేశంలో మధ్యంతర నివేదికను సమర్పించింది.

పరీక్షలో ఫోన్‌తో పట్టుబడితే ఏం చేస్తారు?

కొత్త మధ్యంతర విధానం ప్రకారం.. పరీక్ష హాల్లో విద్యార్థి వద్ద అనుమతి లేని వస్తువు కనిపిస్తే ఇన్విజిలేటర్‌ దాన్ని స్వాధీనం చేసుకుని, నిర్దేశిత ఫారంలో ఘటన వివరాలను నమోదు చేస్తారు. అనంతరం విద్యార్థికి కొత్త ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇచ్చి పరీక్షను కొనసాగించే అవకాశం కల్పిస్తారు. ఈ విధానంలో ఇన్విజిలేటర్‌ పాత్ర ఘటనను నమోదు చేయడంతో ముగుస్తుంది. విద్యార్థి తప్పు చేశాడా? అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే నిర్ణయాన్ని పరీక్ష హాల్లోనే తీసుకోకుండా, సంబంధిత విభాగం క్రమశిక్షణ కమిటీ (DDAC) పరిశీలిస్తుంది. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థి తన వాదనను తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఫారాన్ని అందజేస్తారు. అదనపు సిబ్బంది సమక్షంలో విద్యార్థి తన వివరణను నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ ఫారం నింపడం తప్పనిసరి కాదు. విద్యార్థి తన వాదనను తెలియజేయవచ్చు లేదా అందుకు నిరాకరించవచ్చు.

పరీక్ష తర్వాత కౌన్సెలింగ్‌.. విద్యార్థులకు మానసిక భరోసా

పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థికి అవసరమైన మానసిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. విద్యార్థి పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చినప్పుడు క్యాంపస్‌ క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (QRT)లోని కౌన్సెలర్లకు సమాచారం అందించాలని సిఫార్సు చేసింది. పరీక్షల్లో అక్రమాలపై అనుమానం వచ్చినా, విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడి లక్షణాలు కనిపించినా అధ్యాపకులు QRTకి తెలియజేయాలని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. దీంతో విద్యార్థి పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒంటరిగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశం. ఐఐటీ బాంబే జులై 2026లో ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను సెనేట్‌ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వాటి స్థానంలో ఏప్రిల్‌ 2015 నాటి విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబరు 19, 20 తేదీల నుంచి వాయిదా పడిన మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబరు 10, 11 తేదీల్లో నిర్వహించినప్పుడు ఈ పాత విధానాన్ని అనుసరించారు.

ఇవి కూడా చదవండి

జులై నిబంధనల్లో మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాలకు సంబంధించి కఠిన చర్యలు ఉన్నాయి. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే FR2 అనే ప్రత్యేక శిక్షా గ్రేడ్‌ను విధించే నిబంధన కూడా అందులో ఉంది. కొత్త నిబంధనల ప్రకారం పరీక్ష హాల్లోకి ఫోన్‌ తీసుకెళ్లినా, సందర్భాన్ని బట్టి, పరీక్షలో ఫెయిల్‌ కావడం, తిరిగి పరీక్ష రాయాల్సి రావడం (FR గ్రేడ్‌), ఒక సెమిస్టర్‌ సస్పెన్షన్‌ వంటి చర్యలు ఎదురయ్యే అవకాశం ఉండేది. అయితే 2015 నాటి విధానం ప్రకారం ఫోన్‌ తీసుకెళ్లినందుకు ఒక గ్రేడ్‌ తగ్గింపు విధించవచ్చు. ఫోన్‌ను ఉపయోగించినట్లు తేలితే FR గ్రేడ్‌ ఇవ్వవచ్చు. సామూహిక కాపీయింగ్‌, పదేపదే నిబంధనల ఉల్లంఘన, ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం వంటి తీవ్రమైన ఘటనలకు ప్రధానంగా సస్పెన్షన్‌ను పరిమితం చేశారు. ఆధారాలు స్పష్టంగా లేని సందర్భాల్లో విద్యార్థికి అనుకూలంగా సందేహ ప్రయోజనం కల్పించే విధానమూ ఇందులో ఉంది. సెనేట్‌ సమావేశంలో పాల్గొన్న ఒక అధ్యాపకుడు హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాలనే అభిప్రాయం బలపడిందని, ఎక్కువగా 2015 నాటి నిబంధనలవైపు తిరిగి వెళ్తున్నామని పేర్కొన్నారు.

మధ్యంతర నివేదికలో పరీక్షల నిర్వహణకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. పరీక్ష హాళ్లలో సీసీటీవీ పర్యవేక్షణ, బయో బ్రేక్‌ కోసం ఒకేసారి ఒక్క విద్యార్థికే అనుమతి, పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ప్రవేశాన్ని నిలిపివేయడం వంటి సూచనలు ఉన్నాయి. అలాగే, సాధారణంగా నిర్వహించే భౌతిక తనిఖీలను నిలిపివేయాలని కూడా ప్రతిపాదించారు. ఆరోపణలు ఎదుర్కొనే విద్యార్థులు అధికారిక క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యే ముందే మెంటర్లు, వెల్‌నెస్‌ సలహాదారులతో మాట్లాడేందుకు వీలు కల్పించే ప్రామాణిక కార్యాచరణ విధానాలను (SOPs) రూపొందించేందుకు అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన సంయుక్త కమిటీ కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి మధ్యంతర సిఫార్సులు మాత్రమే. నివేదికలోని ప్రతిపాదనలపై సెనేట్‌ సభ్యులు విస్తృతంగా ఏకీభవించినప్పటికీ, కొన్ని మార్పులను సూచించారు. తుది మార్గదర్శకాలను తర్వాత విడుదల చేయనున్నారు. విద్యార్థుల క్రమశిక్షణను కాపాడటంతో పాటు వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు మరోసారి ముందుకు తెచ్చాయి. పరీక్షల్లో తప్పులు జరిగినప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, విద్యార్థుల వాదనను వినడం, ఒత్తిడిని గుర్తించడం, అవసరమైన సహాయం అందించడం కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్: మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారు, తక్షణ మానసిక సహాయం అవసరమైనవారు భారత ప్రభుత్వ టెలీ-మానస్‌ హెల్ప్‌లైన్‌ 14416కు ఉచితంగా కాల్‌ చేయవచ్చు. ఈ సేవ ద్వారా కౌన్సెలింగ్‌ సహాయం పొందవచ్చు.

Follow Us