AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ!

హైదరాబాద్: క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేదలు తమ ప్రస్తుత నివాస ప్రాంతాలకు దూరం కాకుండా, ఉపాధికి ఇబ్బందులు తలెత్తకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను వేగంగా గుర్తించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Telangana: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ!
2bhk Selection Process
Prabhakar M
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 3:22 PM

Share

ఇందిరమ్మ టవర్స్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్‌టేడ్ ఇచ్చారు. క్యూర్ పరిధిలోని నియోజకవర్గాలను యూనిట్లుగా తీసుకొని ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలి విడతకు అవసరమైన స్థలాల గుర్తింపుతో పాటు రెండో, మూడో విడతల్లో నిర్మించనున్న ఇళ్లకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే, నిర్మాణాలకు అనువైన స్థలాలను గుర్తించాలని స్పష్టం చేశారు. భూముల లభ్యత, స్థలాల అనుకూలతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికకు గడువు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అర్హులైన వారికి న్యాయం జరిగేలా ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు.

లబ్ధిదారుల ఎంపిక కోసం హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నారు. అర్హుల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి ఆన్‌లైన్ డ్రా నిర్వహించడం ద్వారా ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. మూడు జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

యూట్యూబ్‌లో ఎంపిక వివరాలు

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని చూడలేని వారు సైతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉండే వివరాల ద్వారా ఎంపిక జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చని తెలిపారు.

కలెక్టర్లతో మంత్రి సమీక్ష

శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, తదుపరి విడతలకు భూముల గుర్తింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us