ట్యాలెంట్ కి బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదని నిరూపించిన గుంటూరు అమ్మాయి

×

ట్యాలెంట్ కి బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదని నిరూపించిన గుంటూరు అమ్మాయి

కూలి పనులకు వెళ్లే నాన్న, టైలరింగ్ చేసే అమ్మల కష్టాల మధ్య గుంటూరుకు చెందిన వరలక్ష్మి చదువుకుంది. తమ పిల్లలను బాగా చదివించాలనే ఆ తల్లిదండ్రుల కలను నిజం చేస్తూ, వరలక్ష్మి అద్భుత విజయాన్ని సాధించింది. ఆమె ఏకంగా అమెజాన్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలో రూ.46 లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుంది. రాంబాబు, లక్ష్మీ సుజాత దంపతుల కుమార్తె అయిన వరలక్ష్మి వీవీఐటీలో సీఎస్ఈ ఇంజినీరింగ్ చదువుతుంది. చిన్నప్పటి నుంచీ పట్టుదలతో చదువుతూ తరగతిలో ఎప్పుడూ టాపర్‌గా నిలిచింది. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో ఒక చిన్న ఉద్యోగం దొరికినా చాలని ఆశించిన ఆమెకు ఊహించని విజయం లభించింది. అమెజాన్ టీమ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో డేటా ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికైంది. ఇంతపెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని తానసలు ఊహించలేదని వరలక్ష్మి చెప్పింది. తన అన్న చంద్రశేఖర్ పవన్ కుమార్ అండదండలు, కాలేజీ అధ్యాపకుల గైడెన్స్ వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొంది. మనం ఏ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు, మారుతున్న కాలానికి తగ్గట్టు మనల్ని మనం మలుచుకుని పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం ఖాయమని ఆమె నమ్మకం. ఇదే నమ్మకం ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది. వరలక్ష్మితో పాటు కుసుమ అనే మరో విద్యార్థిని కూడా ఇదే రూ.46 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌కు ఎంపికవ్వడం విశేషం. ఇద్దరు విద్యార్థినుల ప్రతిభపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఈ అమ్మాయిల ప్రయాణం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.

Phani CH