బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తూర్పు గాలుల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలో నేడు (సోమవారం) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కూడా తాజాగా ఈ ద్రోణిలో విలీనమైంది. దీనికి తోడు దిగువ స్థాయి గాలులు ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్నాయి. వీటి ఫలితంగా సోమవారం, మంగళవారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
కాగా.. తెలంగాణ సహా.. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 30°C నుంచి 32°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 18°C నుంచి 19°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలోని సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహీర్‌లో 9.7 డిగ్రీలు నమోదయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
