పార్కింగ్ చేసిన కారు ఎక్కడుందో తెలుసుకోవాలా? Google Mapsలో 3 అద్భుతమైన ట్రిక్స్ తెలుసా?
ప్రయాణం చేసేటప్పుడు దారి తెలుసుకోవడానికి చాలామంది Google Maps ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్ కేవలం గమ్యస్థానానికి దారి చూపించడమే కాకుండా రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో ఫీచర్లను అందిస్తోంది. పెద్ద షాపింగ్ మాల్‌లో కారు ఎక్కడ పార్క్ చేశామో మర్చిపోయినా, ఏదైనా హోటల్ లేదా పర్యాటక ప్రాంతానికి వెళ్లే ముందు అక్కడ రద్దీ ఎలా ఉందో తెలుసుకోవాలన్నా Google Mapsలో కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే సమయం ఆదా చేసుకోవచ్చు.

ప్రయాణించే సమయంలో మొబైల్ ఇంటర్నెట్ పనిచేయకపోతే దారి తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముందుగానే మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే కొన్ని ప్రాంతాల్లో నావిగేషన్ ఉపయోగించుకోవచ్చు. చాలామందికి తెలియని ఈ మూడు ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చగలవు. ముఖ్యంగా తరచూ కారులో ప్రయాణించే వారు, కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు వీటి గురించి తెలుసుకోవడం మంచిది.
పార్కింగ్ చేసిన కారు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా?
పెద్ద షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కారు పార్క్ చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ పెట్టామో గుర్తు చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు Google Mapsలోని ‘Save parking’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కారు పార్క్ చేసిన వెంటనే Google Maps ఓపెన్ చేసి మ్యాప్‌పై కనిపించే బ్లూ డాట్ (Blue Dot)పై ట్యాప్ చేయాలి. అక్కడ కనిపించే ‘Save parking’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీరు కారు పార్క్ చేసిన ప్రదేశం మ్యాప్‌లో ‘P’ గుర్తుతో సేవ్ అవుతుంది. తిరిగి వెళ్లేటప్పుడు ఆ గుర్తుపై క్లిక్ చేసి కారు ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు.
ఇంటర్నెట్ లేకుండా మ్యాప్స్ వాడటం..
వారాంతాల్లో ప్రముఖ రెస్టారెంట్లు, దేవాలయాలు లేదా పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ముందు అక్కడ ఎంత రద్దీ ఉందో తెలుసుకోవాలంటే Google Mapsలోని ‘Popular Times’ ఫీచర్ ఉపయోగపడుతుంది. వెళ్లాలనుకుంటున్న ప్రదేశం పేరును సెర్చ్ చేసి, దాని వివరాల పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే ఈ గ్రాఫ్ కనిపిస్తుంది. సాధారణంగా ఏ సమయాల్లో ఎక్కువ రద్దీ ఉంటుందో గ్రాఫ్ ద్వారా అంచనా వేయవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ప్రస్తుతం ఎంత రద్దీ ఉందో తెలిపే ‘Live’ సమాచారం కూడా కనిపిస్తుంది. దీని ఆధారంగా ప్రయాణ సమయాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ఇక ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లోనూ Google Maps ఉపయోగించాలంటే ముందుగానే Offline Maps డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం Google Mapsలో వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని సెర్చ్ చేయాలి. తర్వాత ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి ‘Offline maps’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా డౌన్‌లోడ్ చేసిన మ్యాప్ పరిధిలో నావిగేషన్ ఉపయోగించుకోవచ్చు. అయితే లైవ్ ట్రాఫిక్ వంటి ఆన్‌లైన్ ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉండవు. అలాగే ‘Saved’ ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన ప్రదేశాలను జాబితాలో సేవ్ చేసుకోవచ్చు.
