పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2027 ఫీజు చెల్లింపులు షురూ.. అక్టోబరు 30 నుంచి ప్రారంభం
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. అక్టోబరు 30 నుంచి నవంబరు 16 వరకు రూ.125 ఫీజు చెల్లించవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబరు 28 వరకు అవకాశం కల్పించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఫీజు మినహాయింపు వర్తిస్తుంది..

హైదరాబాద్, అక్టోబర్ 23: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను అక్టోబరు 22న విడుదల చేసింది. విద్యార్థులు అక్టోబరు 30 నుంచి నవంబరు 16 వరకు రూ.125 పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమళ్ల లింగయ్య వెల్లడించారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో మరో మూడు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు.
- ఆలస్య రుసుములేకుండా సాధారణ గడువు: అక్టోబరు 30 నుంచి నవంబరు 16 వరకు – రూ.125
- రూ.50 ఆలస్య రుసుముతో: నవంబరు 18 నుంచి డిసెంబరు 1 వరకు
- రూ.200 ఆలస్య రుసుముతో: డిసెంబరు 3 నుంచి 14 వరకు
- రూ.500 ఆలస్య రుసుముతో: డిసెంబరు 16 నుంచి 28 వరకు
విద్యార్థులు ఈ గడువులను గమనించి, తమ పరీక్ష ఫీజులను సకాలంలో చెల్లించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు కల్పించారు. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలలోపు ఉన్న విద్యార్థులు సంబంధిత ఆదాయ ధ్రువపత్రాన్ని సమర్పిస్తే రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫీజు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు యూపీఐ (UPI) ద్వారా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. వచ్చే మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫీజు చెల్లింపు తేదీలను గుర్తుంచుకుని, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
