AP Schools: ఏపీలో మారనున్న ప్రభుత్వ బడుల స్వరూపం.. కొత్త జాతీయ విద్యావిధానం అమలుకు శ్రీకారం
ఏపీలో ప్రభుత్వ బడుల స్వరూపం మారిపోతుంది. కొత్త జాతీయ విద్యావిధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. వచ్చే నెలలో 3 నుంచి 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయనుంది.

ఏపీలో ప్రభుత్వ బడుల స్వరూపం మారిపోతుంది. కొత్త జాతీయ విద్యావిధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. వచ్చే నెలలో 3 నుంచి 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయనుంది. కొత్త విధానంతో సర్కారీ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి రాబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. నూతన విద్యావిధానం ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ తరగతులుగా పాఠ్యప్రణాళిక ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విధానానికి బదులు కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీతో పాటు ఎల్‌కేజీ, యుకేజీ, మొదటి, రెండో తరగతులను ఫౌండేషన్ తరగతులుగా విభజించనున్నారు.
విద్యార్థి మూడో ఏట పాఠశాలలో చేరితే ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా ఉండేలా ఫౌండేషన్ తరగతులు ఉండనున్నాయి. ఇక ఈ ఐదు తరగతులకు కలిపి ఒక పాఠశాల ఉంటుంది. ఇప్పటి వరకు ప్రైమరీ పాఠశాలలో ఉన్న మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తారు. ఇక్కడ గతంలో మాదిరిగానే ఎస్జీటీ ఉపాధ్యాయులతో టీచింగ్ చేయించాలని నిర్ణయించారు. మూడు నుంచి ఐదు, ఆ తర్వాత ఆరు నుంచి ఎనిమిది, ఇక ఆ మీదట ప్లస్ టు.. ఇలా నాలుగు విభాగాలుగా విభజించారు. కొత్త విద్యావిధానంలో ఇకపై ఎనిమిదో తరగతి ఫైనల్ పరీక్షల్లో కూడా విద్యార్ధులు తప్పనిసరిగా పాస్ కావల్సి ఉంటుంది.
ఓవైపు జాతీయ విద్యావిధానం అమల్లోకి తీసుకురావడంతో పాటు వీలైనంత త్వరగా సీబీఎస్ఈ సిలబస్‌ను కూడా ప్రవేశపెట్టేలా సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్త విద్యావిధానాన్ని స్వాగతిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు దీనిపై మరింత అధ్యయనం అవసరమని అంటున్నారు. అదే సమయంలో టీచర్ పోస్టుల్లో కోత పెట్టకుండా నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలంటున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. నూతన జాతీయ విద్యావిధానం అమలుతో మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.
Also Read..