No-detention Policy: విద్యార్థులకు అలర్ట్.. 5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. 5 - 8 తరగతులకు 'నో డిటెన్షన్ పాలసీ'ని రద్దు చేసింది.. ఇది పాఠశాలల్లో అకడమిక్ అకౌంటబిలిటీని పెంపొందించే దిశగా మార్పును సూచిస్తుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఒకవేళ విద్యార్థులు ఈ తరగతుల్లోని వార్షిక పరీక్షల్లో పాస్ కాకపోతే.. మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాహక్కు చట్టంతో అమల్లోకి వచ్చిన ‘నో-డిటెన్షన్ విధానాన్ని’ (‘No-Detention’ Policy) రద్దు చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5 , 8 తరగతి చదువుతున్న విద్యార్ధులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే. ఒక వేళ విద్యార్ధులు ఫేయిల్ అయితే రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. నో-డిటెన్షన్ విధానం రద్దుతో సంవత్సరాంతపు పరీక్షలలో పాస్ కాని విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
2019లో విద్యా హక్కు చట్టం (RTE)కి సవరణ చేసిన తర్వాత కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే 5, 8 రెండు తరగతులకు ‘నో-డిటెన్షన్ విధానాన్ని’ తొలగించాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థులు వార్షిక పరీక్షలను పాస్ కాకపోతే.. వారికి అదనపు కోచింగ్, క్లాసలు నిర్వహిస్తారు.. వార్షిక పరీక్షలో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ప్రత్యేక తరగతుల నిర్వహించి.. రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారని.. అధికారులు తెలిపారు..
ఒకవేళ రీ-ఎగ్జామ్‌లోనూ ఫెయిల్ అయితే.. విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ స్కూల్ నుంచి బయటకు పంపించరాదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
విద్యపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉండడంతో నో డిటెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకునే హక్కు వాటికే ఉంటుంది..