Sucess Story: యువ తరంగం కక్కిరేణి భరత్ విజయగాథ మీరూ చదవాల్సిందే.. శక్తిగా ఎదిగిన ఓ మామూలు వ్యక్తి కథ!
విజయంమంటే వేయి గుండెలను తట్టి లేపాలి.. విజయమంటే వేయి మందికి స్ఫూర్తినివ్వాలి.. విజయమంటే వేయి తరాలు చెప్పుకోగలగాలి.. విజయమంటే వెయ్యేళ్లు నిలవాలి.. అటువంటి అరుదైన వ్యక్తే కక్కిరేణి భరత్ విజయగాథ. అతనొక సాధారణ వ్యక్తిగా పుట్టి పెరిగిన తన భవిష్యత్తునే కాకుండా తనతోటి యువత జీవితాలను కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాడు.. అంతే ఓ మహా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇతని గురించి మీరూ తెలుసుకోండి..
ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం..20 ఏళ్ల వయసు. టీనేజీ దశ పూర్తి చేసుకొని ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి సోపానం లాంటిది ఈ 20 ఏళ్ల వయసు. అప్పుడప్పుడే ఉన్నతవిద్య పూర్తి చేసుకొని, బాధ్యతలు గుర్తెరిగి ఉద్యోగ జీవితానికి నాంది పలికే సమయం కూడా ఇదే. జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు తొలిమెట్టు. అలాంటిది కేవలం 20 ఏళ్లప్రాయంలోనే, ఉద్యోగం సాధించడం కంటే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం చాలా అరుదైన వ్యక్తులకే సాధ్యమవుతుంది. అలాంటి కోవలోకే వస్తారు కేబీకే గ్రూప్ ఛైర్మన్ భరత్ కుమార్ కక్కిరేణి. విద్యార్థి దశ నుంచే వ్యాపారంలోకి అడుగు పెట్టి కేవలం 35 ఏళ్ల వయసులోనే వివిధ రంగాల్లో కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
నల్లగొండ నుంచి అమెరికా వరకు..
తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి చెందిన భరత్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యాపారంపై అమితాసక్తి ఉన్న భరత్ విద్యార్థి దశలోనే బిజినెస్ వైపు అడుగులు వేశారు. భారంలేని ఉద్యోగం చూసుకోవడం కంటే బాధ్యతను పెంచే వ్యాపారమే లక్ష్యం అంటూ అటువైపు అడుగేశారు. ఉద్యోగాల కోసం వేటాడే కాలంలో, తనే స్వయంగా ఉద్యోగాలు సృష్టించాలని కలలుగన్నారు. ఆకలలు సాకారం చేసుకునే దిశగా ఏక్షణం విశ్రమించకుండా పరిశ్రమించారు. ఓ వైపు గ్రాడ్యుయేషన్ చదువుకుంటూనే చిన్న ఐటీ కంపెనీ నెలకొల్పారు. ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత దశల వారీగా మరిన్ని కంపెనీలు స్థాపించి దిగ్విజయంగా నడుపుతున్నారు.
కేబీకే గ్రూప్ ద్వారా నలుగురికీ ఉపాధి కల్పిస్తూ స్వశక్తితో ఎదగాలనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు భరత్ కుమార్. ఒక్క రంగంలో రాణించడమే గగనమైన ఈరోజుల్లో వ్యవస్థకు అవసరమైన పలు కీలక రంగాల్లో కాలుమోపారు భరత్కుమార్. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్కఅడుగుతోనే మొదలవుతుందని చెప్పినట్లు, ఎవరి సహకారం లేకుండా ఒక సైనికుడిలా మొదలుపెట్టిన కేబీకే వ్యాపార సామ్రాజ్యంలోకి నేడుకొన్ని వందలమంది సైన్యం వచ్చి చేరింది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.. అనే సూత్రాన్ని బలంగా నమ్మే భరత్ నిరంతరం శ్రమిస్తూ తన ఒక్కడితో ప్రారంభమైన తన కంపెనీ ప్రస్థానాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ స్థాయికి తీసుకొచ్చారు. తను బతకడంతో పాటూ నలుగురికీ బతికేందుకు అవకాశాలు సృష్టిస్తున్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులకు అండగా..
స్వశక్తితో అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించిన భరత్ కుమార్.. ప్రస్తుతం తనలాగే యూఎస్ఏ వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు తన వంతుగా సాయం అందిస్తున్నారు. యూనివర్సిటీల గురించి సమచారం అందిస్తూ వారి ఉన్నత విద్యకు సహకరిస్తున్నారు. అక్కడ ఎంఎస్ పూర్తిచేసిన వారికి కూడా ఉద్యోగ అన్వేషణలో ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్, బోన్సాయ్సొల్యూషన్స్ ద్వారా తగిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ కంపెనీల ద్వారా వందలాది మంది భారతీయ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావడంలో తన వంతు సాయం అందించారు భరత్ కుమార్.
సరికొత్త మెళకువలతో డిజిటల్ మార్కెటింగ్
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి వ్యాపారానికి డిజిటల్ నిపుణులు అవసరం. సేవలైనా, ఉత్పత్తులైనా అవి ప్రజల్లోకి వెళ్లాలంటే డిజిటల్ మార్కెటింగ్ సేవలు చాలా అవసరం. కేబీకే బిజినెస్సొల్యూషన్స్ ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తున్నారు భరత్ కుమార్. ప్రస్తుత టెక్నాలజీకు అనుగుణంగా సరికొత్త మెళకువలతో పలు కంపెనీలకు వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు అందిస్తున్నారు. సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు కేబీకే ప్రొడక్షన్స్ ద్వారా షార్ట్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. కేబీకే రియల్టర్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు.
కేబీకే హాస్పిటల్స్ & కేబీకే హెర్మల్స్..
ఆధునిక జీవితంలో ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు తన వంతుగా సేవలు అందించేందుకు వైద్య రంగంలోకి అడుగు పెట్టారు భరత్ కుమార్. కేబీకే హాస్పిటల్స్ నెలకొల్పడం ద్వారా పలు అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. కేబీకే హెర్బల్స్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేని హెర్బల్ మెడిసిన్ సమకూరుస్తున్నారు. ఒక బాధ్యతను బరువు అనుకుంటే మోయాల్సొస్తోంది.. లేదూ పరువు అనుకుంటే కసితో ముందుకెళ్లాలనిపిస్తుంది. ఇలా తాను అడుగుపెట్టిన ప్రతిరంగంలో ఎంతకష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తూ, తన ప్రయాణంలో పరిచయమైన వారికి అవకాశాలిస్తూ, సరికొత్త ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఒక మార్గం చూపిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు కేబీకే.
సరస్వతీ పుత్రికలకు ఆర్థిక సాయం..
ఒక మనిషికి చేయూతనిస్తే సాయం అంటారు.. ఒక సమూహానికి సాయంచేస్తే దైవం అంటారు. ఓ వైపు వ్యాపారంలో నిత్యం తలమునకలవుతూనే సమాజానికి తన వంతు సాయం చేస్తూ దైవం మానుషరూపేణా అనే నానుడిని నిజం చేస్తున్నారు భరత్కుమార్. కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఏటా చదువులో రాణించే సరస్వతి పుత్రికల ఉన్నత విద్య కోసం ఆర్థిక చేయూతనిస్తున్నారు. అభం శుభం తెలియని అనాథల అన్నార్థిని తీర్చేందుకు నెలనెలా అన్నదానం అనే మహాయజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ తన సేవాతత్పరతను చాటుకున్నారు.
సంజీవ రత్నపురస్కారం..
వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు కక్కిరేణి భరత్ కుమార్. వందేభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేత సంజీవరత్న పురస్కార్, రాష్ట్రీయగౌరవ పురస్కార్ అవార్డులు అందుకున్నారు. వ్యాపారాల్లో విజయవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ప్రముఖ మ్యాగజైన్ ఫార్చూన్ బిజినెస్ కౌన్సిల్ 2024 జాబితాలో నిలిచారు.
ఆధ్యాత్మిక చింతనతో అమెరికాలో ఆలయం
స్వశక్తితో వ్యాపారంలో విజయాలు సాధించిన భరత్ కుమార్‌కు దైవచింతన కూడా ఎక్కువే. ఆధునిక జీవనశైలిలో మానసిక ఉల్లాసానికి, ఆశావహ దృక్పథానికి ఆధ్యాత్మిక మార్గం ఉన్నతమైందిగా భావించే ఆయన అమెరికా వెళ్లినా మూలాలు మరవలేదు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరశివారులో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారు భరత్ కుమార్. అయ్యప్ప దీక్షాదారుడైన భరత్ కుమార్ హరిహర క్షేత్రం పేరుతో శైవ, వైష్ణవక్షేత్రం నిర్మాణాన్ని తలపెట్టారు. జార్జ్ టౌన్ ప్రాంతంలోని 375 కింగ్రియాలో ఓ భారీ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శివాలయాలతో పాటు గణపతి, అయ్యప్ప స్వామి, దుర్గ, సరస్వతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.
ఒక మనిషి గెలిస్తే విజయం.. పది మందిని గెలిపిస్తే అది ఆదర్శం. నలుగురికీ ఆదర్శంగా నిలిచే అరుదైన వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉండే భరత్ కుమార్ వ్యాపార ప్రస్థానంలో 15 వసంతాలు పూర్తి చేసుకొని, 16వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ 15 ఏళ్ల తన ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. నిరంతర శ్రమతో తాను ఎదుగుతూ, తన చుట్టూ ఉండే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు.