AP Intermediate Exams: వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేస్తాం.. ఇంటర్ విద్యా మండలి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు..
అమరావతి, జనవరి 9: ఇంటర్ విద్యలో కీలక సంస్కరణల దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్‌ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్‌ఈ విధానంలోకి మారింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు.
చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామన్నారు. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే 15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారని, దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో సెకండియర్ పరీక్షల్ని మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఫస్టియర్ పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహించబోతున్నాని వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఇంటర్‌లో ప్రవేశపెట్టి, కొత్త ముసాయిదా ప్రకారం ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్, ప్రాక్టికల్స్ తప్పనిసరని చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు, సలహాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సలహాలు, సూచనలు బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో జనవరి 26లోగా వెల్లడించాలని కోరారు. లేదా biereforms@gmail. com మెయిల్‌కు సైతం అభిప్రాయాలు పంపాలని కృతికా శుక్లా తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.