Basara RGUKT 2025 Notification: బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. టెన్త్ పాసైతే చాలు BTech సీటు మీదే
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (బాసర ఆర్జీయూకేటీ) 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం (మే 28) విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్ధులు..

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాసర్ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను వీసీ గోవర్దన్ బుధవారం (మే 28) విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం మే 31 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. బాసర క్యాంపస్‌లో 1500 సీట్లు, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో 180 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ విధానంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్ధులు ఎవరైనా జూన్ 21, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈకింద చెక్ చేసుకోండి..
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలోని విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతిమ ర్యాంకు కేటాయించనున్నారు. అవేంటంటే.. తొలుత గణితంలో, ఆ తర్వాత సైన్స్, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అలాగే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు రూ.1500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అయితే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు మాత్రం తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్‌తోపాటు సంబంధిత సర్టిఫికెట్లను స్పీడ్‌పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ కింది అడ్రస్‌కు జూన్ 25, 2025వ తేదీలోగా పంపించవల్సి ఉంటుంది.
పోస్టల్ చిరునామా..
ది కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ 2025-26, ఆర్జీయూకేటీ -బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ- 504107.
ఎలా దరఖాస్తు చేయాలంటే?
- మందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపాలి. దరఖాస్తు సబ్‌మిట్ చేశాక అప్లికేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. అనంతరం దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలి.
- దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
- అయితే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు మాత్రం తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్‌ను పోస్టు ద్వారా పంపించాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




