Fees for BBA, BCA: ఎట్టకేలకు బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులు ఖారారు.. అయినా విద్యార్ధుల్లో తొలగని సందిగ్ధత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తు్న్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులను ఖరారు చేయకుండానే వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం బీబీఏ, బీసీఏ కోర్సులకు..
అమరావతి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తు్న్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులను ఖరారు చేయకుండానే వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కాజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులకు రూ.18 వేల చొప్పున నిర్ణయించింది. ఈ కోర్సుల్లో కనిష్ఠ ఫీజును వీటికి అమలు చేసింది. ఈ ఫీజులు రెండేళ్లపాటు అమల్లో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.
‘డిగ్రీ’ కౌన్సెలింగ్‌లో వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం
బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులను నిర్ణయించడంతో డిగ్రీ కౌన్సెలింగ్‌లో కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 5వ తేదీ వరకూ వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చని, ఆగస్టు 10న సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి పేర్కొంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 12 నుంచి 18వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రోజుకొక్క కొత్త సమస్య.. పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ
కాగా ఉన్నత విద్యలో ప్రవేశాల కౌన్సెలింగ్ నేపథ్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కొన్ని నెలలుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎంతో కీలకమైన కౌన్సెలింగ్‌లో ఫీజులు నిర్ణయం చేయకపోవడంపై ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటీవల నిర్వహించిన ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల సందర్భంగా ఒక రోజు ఆలస్యంగా వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రారంభించింది. ఈ సమాచారాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్తపడింది. ఈ విషయం తెలియని వేలాది మంది విద్యార్ధులు వెబ్ ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాశారు. అనంతరం ఆలస్యంగా వెబ్‌సైట్‌లో త్వరలోనే వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం ఇస్తామనే సమాచారం పెట్టారు. ఇక రెండో విడత కౌన్సెలింగ్, క్యాటగిరి-బీ సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇష్టారీతిలో వ్యవహరిస్తుంది. తాజాగా డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనూ ఇదే పంథా. ఎలాంటి సమాచారం జారీ చేయకుండానే షెడ్యూల్‌ను మూడు సార్లు సవరించారు. వెబ్ ఐచ్ఛికాలను కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాయిదా వేశారు. మళ్లీ సమచారం ఇవ్వకుండానే గురువారం మధ్యహ్నం నుంచి వెబ్‌ఐచ్ఛికాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాలకు 1.65లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఒకే కాలేజీలో 2 కోర్సులను ఎంపిక చేసుకున్న వానికి వెబ్‌ఐచ్ఛికం పని చేయడం లేదని విద్యార్థులు ఫిర్యాలు చేస్తున్నారు. దీంతో ఒక్కో కాలేజీకి ఒక్క కోర్సే ఎంపిక చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ సమస్యలను పట్టించుకునే నాథుడు కరువయ్యారంటూ తలలు పట్టుకుంటున్నారు.