APPSC Group 2 Mains Key: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలను పరీక్ష జరిగిన రోజునే కమిషన్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..

అమరావతి, ఫిబ్రవరి 24: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారిలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక మొత్తం అభ్యర్ధుల్లో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరిగింది. ఈ రెండు పేపర్లకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలు ఇచ్చారు. పరీక్ష జరిగిన రోజునే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీలను కూడా విడుదల చేసింది. వీటితోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు లేవనెత్తాలని కమిషన్ కోరింది.
కాగా నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసినప్పటికీ పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖ రాశారు. శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్నందున వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణపై శనివారం రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్ష వాయిదా పడుతుందన్న ఆశతో అభ్యర్ధులు ఉంటే.. అనూహ్యరీతిలో పరీక్ష వాయిదా వేయలేమని, పరీక్ష నిర్వహించాల్సిందేనని ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. దీంతో ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు పేపర్లకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరిగాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో పేపర్ 1 సులభంగా ఉందని, పేపర్ 2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించినవారు, ప్రామాణిక మెటీరియల్‌తో సిద్ధమైనవారు సులువుగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందని అన్నారు. ఇక పేపర్ 2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం తాజా పరిణామాలపై ప్రశ్నలు అడిగారని అన్నారు. అయితే రెండు పేపర్లలోనూ అసెర్షన్ అండ్ రీజన్, స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. దీంతో అన్నింటికి సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.