10th Class Exams 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో దొర్లిన తప్పిదాలు.. ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే అందరికీ 6 మార్కులు!
రాష్ట్రంలోని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ, ఇంగ్లిష్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లినట్లు పేర్కొంది. దీంతో ఆయా ప్రశ్నలకు మార్కులు కలపనున్నట్లు ప్రకటించింది. హిందీ పరీక్షలో రెండు మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో 4 మార్కులు చొప్పున..

అమరావతి, ఏప్రిల్ 5: ఈ ఏడాది జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పలు పొరపాట్లు దొర్లినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. హిందీ, ఇంగ్లిష్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లినట్లు పేర్కొంది. దీంతో ఆయా ప్రశ్నలకు మార్కులు కలపనున్నట్లు ప్రకటించింది. హిందీ పరీక్షలో రెండు మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్‌లో 3, 6 బిట్లలో అక్షర దోషాలు దోర్లాయి. దీంతో ఈ రెండు ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున రెండు మార్కులు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అయితే విద్యార్ధులు ఈ రెండు ప్రశ్నలను అటెంప్ట్ చేసి ఉండాలని, విద్యార్ధులు సమాధానాలు తప్పుగా గుర్తించినా మార్కులు ఇస్తామని అన్నారు.
ఇక ఇంగ్లిష్ పరీక్ష క్వశ్చన్ పేపర్‌లో 28వ ప్రశ్న టెక్ట్స్ బుక్ నుంచి కాకుండా వర్క్‌బుక్ నుంచి వచ్చింది. ఈ ప్రశ్నలో అండర్‌లైన్ చేసిన నాలుగు పదాలకు వ్యతిరేక పదాలు రాయాలని 4 మార్కుల ప్రశ్నను అడిగారు. అయితే బ్లూప్రింట్‌కు వ్యతిరేకంగా ఈ ప్రశ్నను అడిగారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ ప్రశ్నకు జవాబు రాసిన వారందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా రెండు సబ్జెక్టులకు కలిపి మొత్తం 6 మార్కులను కలపనున్నట్లు పరీక్షల విభాగం జిల్లా విద్యాధికారులకు సమాచారం పంపించారు.
కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మార్కులు కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ రోజు బోర్డు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. ఇది పూర్తి కాగానే ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది. పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




