AP Inter Supply 2024 Exams: ఏప్రిల్ 18 నుంచి ‘ఇంటర్’ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ఫీజు చెల్లింపులు.. ‘సప్లిమెంటరీ’ కూడా
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్..
అమరావతి, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.
ఒక్కో పేపర్ జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చెల్లించాలని సూచించారు. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలని తెలిపారు. ఇక సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రూ.550 చెల్లించాలి. ఇక ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని ఆయన వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలను కుంటే.. అటువంటి వారు రూ.550 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. దీంతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం రెండింటికీ ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 ఫీజుగా చెల్లించాలని ఆయన సూచించారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ తమ కాలేజీల్లోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని సూచించారు. కాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నామని ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించిన వారు మాత్రమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయం అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్ధులకు తెలియజేయాలని సౌరభ్ గౌర్ కోరారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.