AP Mega DSC 2025 Merit List: నిరుద్యోగులకు అలర్ట్.. రేపే మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల! సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పట్నుంచంటే..
AP Mega DSC 2025 Merit List for Certificate Verification: మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఫలితాలు విడుదల చేయగా.. ర్యాంకులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఆగస్ట్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ..

అమరావతి, ఆగస్టు 19: మెగా డీఎస్సీ 2025 పరీక్షలు రాసి మెరిట్ లిస్ట్ కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఆదివారం వరకు టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇచ్చిన విద్యాశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. ర్యాంకులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఆగస్ట్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ తదుపరి చర్యలకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా వెల్లడించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
అయితే గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులను ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అనంతరం జాబితాలోని అభ్యర్ధులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. దీనిని సెప్టెంబరు నెల మొదటి వారంలోపు సిద్ధం చేయనున్నారు. ఇక అదే నెల రెండో వారంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది.
కాగా మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసందే. అంతే సంఖ్యలో సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్ధులను ఎంపిక చేసి, వారిని పిలవనున్నారు. ఒకవేళ ఇలా పిలిచిన వారిలో ఎవరివైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ పోస్టును తదుపరి ర్యాంకు అభ్యర్ధికి కేటాయించడం జరుగుతుంది. ఇలా మొత్తం 16,347 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. దీంతో బుధవారం (ఆగస్ట్ 20) విడుదలయ్యే సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత రానుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది జాబితాను అధికారులు సెప్టెంబర్ మొదటి వారంలో వెల్లడిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




