AP Inter Marks: ఇంటర్మీడియట్ పాస్ మార్కుల్లో కీలక మార్పులు.. కొత్త విధానం చూశారా?
Andhra Pradesh Intermediate Board issues new pass marks policy: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇంటర్ మార్కుల్లో మార్పులు చేసినట్లు ప్రకటన వెలువరించింది. మ్యాథమెటిక్స్ పేపర్ 1ఏ, పేపర్ 1బీ రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే 35 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించారు..

అమరావతి, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇంటర్ మార్కుల్లో మార్పులు చేసినట్లు ప్రకటన వెలువరించింది. మ్యాథమెటిక్స్ పేపర్ 1ఏ, పేపర్ 1బీ రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే 35 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించారు. పాత విధానం ప్రకారం ఒక్కో పేపర్‌కి 75 మార్కులు ఉండేవి. దీంతో పాస్ అవ్వడానికి 25 మార్కులు అవసరమయ్యేవి. తాజాగా ఈ రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే సబ్జెక్టుగా బోర్డు మార్చింది. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్‌లో 29, సెకండియర్‌లో 30 మార్కులు వస్తేనే పాసైనట్లు పరిగణిస్తారు. ఈ మేరకు ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్ మ్యాథ్స్ ఎ, బిలను కలిపి ఒకే సబ్జెక్ట్‌గా పరిగణించడం, అలాగే బోటనీ, జువాలజీ పేపర్లను కూడా ఒకే సబ్జెక్ట్‌గా పరిగణించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణ స్కూళ్లలో 62 శాతం విద్యార్థులకు అపార్ కేటాయింపు
తెలంగాణ రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో 62 శాతం మంది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు సంఖ్య ఇచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆధార్ వివరాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల రికార్డుల్లో వివరాలు ఒకేలా ఉన్న వారికి మాత్రమే అపార్ ఐడీని కేంద్ర విద్యాశాఖ జారీ చేస్తుంది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ అనే లక్ష్యంతో ఈ విధానం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి చదువు పూర్తయ్యే వరకు ఒకే గుర్తింపు సంఖ్య ఉండాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధుల ప్రగతితోపాటు ఎవరైనా చదువు మానేసినా వెంటనే తెలిసిపోతుందనే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చింది.
తద్వారా డ్రాపౌట్‌కు కారణాలు తెలుసుకొని మళ్లీ వారు చదువుకునేలా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అపార్ సంఖ్యతో ధువపత్రాలను డిజి లాకర్‌లో భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 62 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అపార్ ఐడీ ఇవ్వగలిగామని అన్నారు. ఆధార్ కార్డులో సమస్యల కారణంగా అపార్ సంఖ్య కేటాయించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అలాంటి వారికి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు(పెన్) ఇస్తున్నామని సమగ్ర శిక్షా వర్గాలు తెలిపాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




