వచ్చే విద్యా సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు.. విద్యాశాఖ నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి, పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్ట్ పరీక్షలను వంద మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వంద మార్కులకు బదులు 80 మార్కులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. అందుకు కారణం ఇదే..
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రస్తుతం వంద మార్కులకు నిర్వహిస్తున్న పరీక్షలను 80 మార్కులకు కుదించి, మిగతా 20 అంతర్గత మార్కులుగా మార్చనున్నారు. రాష్ట్రంలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలుచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం వంద మార్కులకే పరీక్షలు పెడుతున్నారు. ఇదే సిలబస్‌తో సీబీఎస్‌ఈలో ఇంటర్నల్ మార్కుల విధానం ఉంది. దీంతో సిలబస్‌తోపాటు పరీక్షల విధానం కూడా సీబీఎస్‌కు అనుగుణంగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది. ప్రైవేటు బడులు ఎక్కువగా మార్కులు వేసుకుంటున్నాయని 2019లో పదోతరగతిలో ఆ విధానాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటు బిట్ పేపర్ విధానాన్ని సైతం తొలగించింది. ఇప్పుడు ఎన్‌సీఈఆర్టీ సిలబస్, సీసీఈ విధానం అమలుచేస్తున్నందున అంతర్గత మార్కులను తిరిగి తీసుకురావాలని భావిస్తోంది.
అయితే ఇంటర్నల్ మార్కులను ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఫార్మెటివ్ పరీక్షల విధానంలో మార్పు చేసి, రాతపరీక్షకు మార్కులు పెంచిన సంగతి తెలిసిందే. ఫార్మెటివ్ 3 వరకు రాత పరీక్ష 20, ప్రాజెక్టులకు 10, తరగతిలో విద్యార్థి స్పందనకు 10, నోటుబుక్స్ ఇతరత్ర వాటికి 10 మార్కుల చొప్పున మార్కులు కేటాయించేవారు. ఇప్పుడు వీటిని వరుసగా 35, 5, 5, 5 మార్కులుగా మార్పు చేసింది. దీంతో రాత పరీక్ష వెయిటేజీ పెరిగింది.
వచ్చే విద్యా సంవత్సరానికి ఇదే విధానాన్ని కొనసాగించాలా లేదా కొత్త విధానం ఏమైనా తీసుకురావాలా అనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు ఇంటర్నల్ మార్కుల విధానం అమలులో ఉంది. ఇకపై ఈ విధానాన్ని 9, 10 తరగతుల్లో కూడా తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. దీని ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సైతం 80 మార్కులకు నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు పాఠశాల స్థాయిలోనే రాసిన పరీక్షలను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయిస్తారన్నమాట.