AP 10th Public Exams 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు .. ఫీజు చెల్లింపులు ఎప్పట్నుంచంటే?
AP 10th Class Public Exam fee 2026 Dates: ఈ సారి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. పదో తరగతి భాషేతర సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్లో విద్యార్థులను ఆరు రకాలుగా పరీక్షించనున్నారు. పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సృజనాత్మకత, అప్లికేషన్, ఎవాల్యూయేషన్‌ను

అమరావతి, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజులను అక్టోబరు 28వ తేదీ నుంచి చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికీ ఈసారి తప్పనిసరిగా అపార్ ఐడీ అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఎవరికైనా లేకపోతే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఈ సారి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. పదో తరగతి భాషేతర సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్లో విద్యార్థులను ఆరు రకాలుగా పరీక్షించనున్నారు. పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సృజనాత్మకత, అప్లికేషన్, ఎవాల్యూయేషన్‌ను పరిశీలించేలా ప్రశ్నలు ఇస్తారు. అలాగే ప్రశ్నల్లో దీర్ఘ, చిన్న, చాలా చిన్న సమాధానం రాసేలా మార్పు చేయనున్నారు. వీటికి ఎంత వెయిటేజీ ఇవ్వాలనే దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. భాష సబ్జెక్టులకు మాత్రం.. భాషా అంశాలపై పరిజ్ఞానం, గ్రహణశక్తి, వ్యక్తీకరణ, ప్రశంసల విభాగాలుగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రశ్నలు మాత్రం భాషేతర, భాష సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటాయి. గతంలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉండగా వీటిని తొలగించారు. వీటి స్థానంలో ఒక్క మార్కు ప్రశ్నలు తీసుకొస్తున్నారు. ఏపీలోనూ ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తున్నందున ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఈ మార్పు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
విద్యార్థుల్లోని సృజనాత్మకత పరిశీలించేలా ప్రశ్నాపత్రంలో ఈ మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. గత కొన్నేళ్లుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సీబీఎస్‌ఈ బోర్డుతో పోల్చితే రాష్ట్ర బోర్డుల్లో ఉత్తీర్ణత తక్కువగా నమోదు అవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పదో తరగతి ఫలితాల్లో గణనీయంగా ఫెయిలౌతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికంగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఈ క్రమంలో పదో తరగతి ప్రశ్నపత్రాల్లో చేయాల్సిన మార్పులపై రాష్ట్రానికి సూచనలు జారీ చేసింది.
ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




