Telangana: ప్రతిభకు అడ్డురాని వైకల్యం.. ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అంధురాలు!
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఏనాడో మహానుభావులు చెప్పారు. విధి రాతను మార్చుకుని.. తన రాతను తానే రాసుకొని అనుకున్నది సాధించింది ఈ యువతి. తనకున్న వైకల్యంతో ఏనాడు నిరుత్సాహపడకుండా.. మనోధైర్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందరిలా తాను సాధిస్తే దాంట్లో విశేషమేముంటుంది. అందుకే ఆ యువతి ప్రతిభకు ఎలాంటి వైకల్యం అడ్డురాదని నిరూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..
నల్గొండ, జులై 5: కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఏనాడో మహానుభావులు చెప్పారు. విధి రాతను మార్చుకుని.. తన రాతను తానే రాసుకొని అనుకున్నది సాధించింది ఈ యువతి. తనకున్న వైకల్యంతో ఏనాడు నిరుత్సాహపడకుండా.. మనోధైర్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందరిలా తాను సాధిస్తే దాంట్లో విశేషమేముంటుంది. అందుకే ఆ యువతి ప్రతిభకు ఎలాంటి వైకల్యం అడ్డురాదని నిరూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
నల్లగొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి అంధురాలైన కూతురు జన్మించింది. అయితే వీరు కుంగిపోకుండా కూతురు శ్రీపూజితను అంధురాలిగా కాకుండా సాధారణ యువతులా పెంచారు. పదోతరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో, ఇంటర్ సాయి అంధుల జూనియర్ కళాశాల (హైదరాబాద్), డిగ్రీ బీఏ కోర్సు నల్గొండ ఎన్జీ కళాశాలలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడీ నల్గొండ గోకుల్ కళాశాలలో చదివింది. జాతీయస్థాయిలో నిర్వహించే నెట్‌కు సైతం అర్హత సాధించింది. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తిచేసింది.
2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ ఉద్యోగం చేస్తూనే… గురుకుల లెక్చరర్ కొలువుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది. పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) తెలుగు, సోషల్, టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) తెలుగు, సాంఘికశాస్త్రం, జూనియర్ లెక్చరర్ తెలుగు, డిగ్రీ లెక్చరర్ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను పలువురు ప్రశంసిస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం…
తాను అంధురాలునని ఏ రోజూ బాధపడలేదు. మా తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్త్యైర్యం ఇచ్చారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజూ చదువుపరంగా ఇబ్బంది పడలేదని శ్రీ పూజిత చెబుతోంది. ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారని, అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించేదానినని చెబుతోంది. పోటీపరీక్షల ప్రిపరేషన్‌కు అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్‌లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్ అయ్యానని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించవచ్చని నారు. టీచింగ్ ఫీల్డ్ పై తనకు మక్కువ ఉందని, ఆరు ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని శ్రీ పూజిత చెబుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.