TGPSC Group 1 Results 2024: వెనక్కితగ్గని సర్కార్.. 1:50 నిష్పత్తిలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విదల! మెయిన్స్ అర్హుల జాబితా ఇదే..
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం (జులై 7) విడుదల చేసింది. గ్రూప్ 1 ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 563 గ్రూప్1 పోస్టుల భర్తీకి సంబంధించిన జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను.. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని..
హైదరాబాద్, జులై 7: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం (జులై 7) విడుదల చేసింది. గ్రూప్ 1 ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 563 గ్రూప్1 పోస్టుల భర్తీకి సంబంధించిన జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను.. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జూన్ 13న విడుదల చేసింది. మొత్తం 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,02,172 మంది (74.86 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనుంది.
కాగా గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారంగా అభ్యర్ధులను ఎంపికచేయాలని నిరుద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తగ్గలేదు. జులై 5న నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినా.. పట్టించుకోని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తి ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపికచేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారంగానే ఈ రోజు ఫలితాలను వెల్లడించింది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పతి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు ఎంతగా డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీజీపీఎస్సీ మెయిన్స్ అర్హుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అందరికీ న్యాయం జరగాలంటే గతంలో వచ్చిన జీవో 55ను అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 చొప్పున పోస్టుల సంఖ్యను పెంచుతూ అనుబంధంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అదనపు పోస్టులు పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కమిషన్ చరిత్రలో కోకొల్లలు ఉన్నాయని, ఈ విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు గుర్తు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనడం పూర్తిగా అవాస్తవమని చెబుతున్నారు. మరోవైపు జుతై 18 నుంచి ఆగస్టు 4 వరకు డీఎస్సీ పరీక్షలు ఉండగా.. వీటిని వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటే ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.