Ola Electric Scooter: వావ్.. సరికొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫీచర్ అదిరిపోయిందిగా!
ఓలా స్కూటర్లలో హైపర్ చార్జింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల కేవలం 15 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన ఓలా సంస్థ.. ఇప్పుడు తన వినియోగదారుల కోసం మరో అత్యాధునిక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూవ్ ఓఎస్ 3ను వచ్చే వారం విడుదల చేయన్నున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది దీపావళి రోజునే ఈ సాఫ్ట్ వేర్ అప్ డేట్ కు సంబంధించిన వివరాలను ఓలా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు దీనిని ధ్రువీకరిస్తూ.. వచ్చే వారం నుంచే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ ట్విటర్ లో వెల్లడించారు. ఈ కొత్త సాఫ్ట్ వేర్ తో స్కూటర్ పనితీరు మెరుగవ్వడంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఓలా ఎస్1 ఎయిర్ లో మాత్రమే మూవ్ ఓఎస్3 ఉంది.
సూపర్ ఫాస్ట్ చార్జింగ్..
కొత్త అప్ డేట్ ద్వారా ఓలా స్కూటర్లలో హైపర్ చార్జింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల కేవలం 15 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఫలితంగా వినియోగదారులకు చార్జింగ్ కష్టాలు తప్పినట్లు అవుతుంది.
ఫుల్లీ ఆటోమేటిక్..
ఈ మూవ్ ఓఎస్3 సాఫ్ట్ వేర్ లో వస్తున్న మరో అధునాతన సదుపాయం ప్రాక్సిమిటీ అన్ లాక్. ఈ ఫీచర్ ద్వారా ఓలా స్కూటర్లను తాళం లేకుండా వినియోగించవచ్చు. వాహనదారుడు స్కూటర్ దగ్గరకు రాగానే అది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. దూరం వెళ్లినప్పుడు ఆటోమేటిక్ గా లాక్ పడుతుంది. దీనివల్ల ఎప్పుడైనా తాళం మర్చిపోయినా.. పోగొట్టుకున్నా.. ఇబ్బందులు ఉండవు.
పార్టీ మోడ్.. జిగేల్.. జిగేల్..
ఓలా ఓఎస్3 ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న మరో ఆకర్షణీయమైన ఫీచర్ పార్టీ మోడ్. యూజర్ వినే సాంగ్ నకు అనుగుణంగా లైట్స్ ఆరుతూ వెలుగుతూ ఉంటాయి. ఇందుకోసం ప్రొప్రైటరీ యాప్ ద్వారా స్కూటర్ అనుసంధానం కావాల్సి ఉంటుంది.
కాలర్ నేమ్ డిస్ ప్లే..
సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు జేబులో ఉండే ఫోన్ మోగితే, బండి పక్కకు పెట్టి .. ఎవరు చేశారో చూసి లిఫ్ట్ చేస్తాం. ఒకవేళ అది స్పామ్ కాల్ అయితే కోపం, చిరాకు వస్తాయి. ఓలా స్కూటర్ వినియోగదారులకు ఇకపై ఆ బాధ తప్పనుంది. స్కూటర్ నడుపుతున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే.. ఆ కాలర్ పేరు ఇకపై స్క్రీన్ పై డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది. దానికి ఆటో రిప్లయ్ కూడా ఇవ్వవచ్చు. వీటితోపాటు హిల్ అసిస్ట్ సదుపాయం కూడా కొత్తగా తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్కూటర్ లో ఉండే సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి.. అవసరమైనంత బ్రేక్ ప్రెజర్ ఉండేలా చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..