Ola Electric Scooter: ఎదురుచూపులకు పుల్‌స్టాప్! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ తేదీలు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచి అంటే..
ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా స్కూటర్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి టెస్ట్ రైడ్ తేదీలను కంపెనీ ప్రకటించింది.
Ola Electric Scooter: ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా స్కూటర్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి టెస్ట్ రైడ్ తేదీలను కంపెనీ ప్రకటించింది. వచ్చే నెల నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో ఓలా ఈ సదుపాయాన్ని అందిస్తుంది. వినియోగదారులు నవంబర్ 10 నుండి ఓలా ఎస్ 1అలాగే, ఓలా ఎస్ 1 ప్రో రెండింటినీ టెస్ట్ రైడ్ చేసే అవకాశం ఉందని కంపెనీ చెప్పింది. కంపెనీ ఈ సమాచారాన్ని ‘ఓలా ఎలక్ట్రిక్’ వెబ్‌సైట్‌లోని ప్రశ్నోత్తరాల విభాగంలో చెప్పింది.
అందుకే టెస్ట్ రైడ్ సదుపాయం..
ఓలా తన వెబ్‌సైట్‌లో స్కూటర్ టెస్ట్ రైడ్‌కి సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సంబంధించి జవాబులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ వినియోగదారుడు స్కూటర్ టెస్ట్ రైడ్ ఎందుకు అందిస్తున్నారనే ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా.. ఓలా స్కూటర్ కొనుక్కోవాలని నగదు జమ చేసిన కొనుగోలుదారులు స్కూటర్ నడిపి చూడాలని కోరుకోవడం సహజం. అందుకే టెస్ట్ రైడ్ సదుపాయం అందిస్తున్నామని కంపెనీ చెప్పింది. ఇక స్కూటర్ డెలివరీకి ప్రతి కస్టమర్‌కు టైమ్ ఫ్రేమ్ సెట్ చేసినట్టు ఓలా ప్రతినిధి చెప్పారు. ఆ విధంగానే డెలివరీ ఉంటుందని వెల్లడించారు. ఓలా ఎస్ 1 ఐదు రంగుల్లో వస్తుండగా, ఓలా ఎస్ 1 ప్రో 10 రంగుల్లో వస్తోంది.
నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్ ప్రారంభమవుతుంది..
ఓలా ప్రతినిధి ఈ విషయంపై , “స్కూటర్ టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత కస్టమర్ తను చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అందువల్ల టెస్ట్ డ్రైవ్ తేదీ ప్రకారం తుది చెల్లింపు కోసం వెబ్‌సైట్‌లో విండో ఓపెన్ అవుతుంది. టెస్ట్ రైడ్ నవంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది, దీని గురించి వినియోగదారులకు సమాచారం అందించాం. ప్రతి కస్టమర్‌కు సమయ పరిమితిలో స్కూటర్ అందించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము.” అంటూ వివరించారు.
టెస్ట్ రైడ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ అవసరం
ఓలా స్కూటర్లను బుక్ చేసుకున్న కస్టమర్‌లు టెస్ట్ రైడ్ కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. టెస్ట్ రైడ్ కోసం కస్టమర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలని కంపెనీ తెలిపింది. టెస్ట్ రైడ్ సమయాలను ఇవ్వడం కోసం కంపెనీ నేరుగా కస్టమర్‌ని సంప్రదిస్తుంది. ఓలా డీలర్‌షిప్‌లను అందించే అసాధారణ పద్ధతులను అవలంబిస్తున్నందున, ఇది తన వినియోగదారులకు టెస్ట్ రైడ్‌లను ఎలా అందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. ఈ టెస్ట్ రైడ్ ఏ నగరాల్లో జరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
స్కూటర్ల విక్రయాలు నవంబర్ 1 నుంచి మళ్లీ..
ఆగస్టులో అధికారిక లాంచ్ ఈవెంట్ తర్వాత కంపెనీ ఓలా ఎస్ 1 బుకింగ్ ప్రారంభించింది. స్కూటర్ అమ్మకం ప్రారంభించడానికి కంపెనీ సెప్టెంబర్ 8 తేదీని నిర్ణయించింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా బుకింగ్‌లు ఒక వారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే, బుకింగ్ చేసిన రెండు రోజుల్లోనే కంపెనీ స్కూటర్లు రూ.1100 కోట్ల విలువైనవి అమ్ముడయ్యాయి. స్కూటర్ల అమ్మకం నవంబర్ 1 నుండి తిరిగి ప్రారంభమవుతుంది.
ఓలా స్కూటర్ ధరలు ఇలా..
ఓలా ఎస్ 1 ధర రూ .99,999-ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,999గా నిర్ణయించారు. కానీ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ ,రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో, అవి వేర్వేరు ధరలలో అందుబాటులో ఉన్నాయి. గుజరాత్‌లో ఓలా ఎస్ 1 ధర రూ .79,999 కాగా ఓలా ఎస్ 1 ప్రో రూ .1,09,999 కి అందుబాటులో ఉంది. దీనికి కారణం ఆ రాష్ట్రాల్లో వివిధ రేట్లకు సబ్సిడీ అందుబాటులో ఉండటమే.
ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!
Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!
Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..