Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Subsidy: వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ పథకంలో ఉన్నవారికి రాయితీ కొనసాగింపు..?

దేశంలో ప్రతి గృహిణి పొగ నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లకు కేంద్రప్రభుత్వం..

LPG Subsidy: వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ పథకంలో ఉన్నవారికి రాయితీ కొనసాగింపు..?
lpg cylinder
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 26, 2022 | 1:22 PM

దేశంలో ప్రతి గృహిణి పొగ నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లకు కేంద్రప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ పథకంలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లపై కేంద్రప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మీరు ఉజ్వల పథకం లబ్ధిదారు అయితే, ఎల్పీజీపై రాయితీని పొందవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్‌పై ఏడాదిలో 12 సిలిండర్‌లకు ఒక్కోదానికి రూ. 200 సబ్సిడీని ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంది. ఉజ్వల యోజన పథకంలో గ్యాస్‌ సిలిండర్‌పై రాయితీని మార్చి 2023 తర్వాత కూడా పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని మహిళలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం రూ.1,600ల ఆర్థిక సహాయం అందించడం, అలాగే వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఉజ్వల యోజనను కేంద్రప్రభుత్వం అమలుచేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో ఈ పథకాన్ని బలోపేతం చేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి, మేఘాలయలో కేవలం 54.9శాతం మంది మాత్రమే వంట గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత త్రిపుర, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో వరుసగా 79.3శాతం, 80.2శాతం, 80.6శాతం మంది వంట గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వంట గ్యాస్‌ను వినియోగించే్దుకు వీలుగా ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించే యోజనలో ఉంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లోక్‌సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశంలో LPG కనెక్షన్ల సంఖ్య 325 మిలియన్లకు చేరుకుందని, వాటిలో 96 మిలియన్ కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అందించినట్లు తెలిపారు.

గ్యాస్ సిలిండర్‌ ధరలు దేశంలోని సాధారణ ప్రజలకు ఎల్లప్పుడూ ఆందోళన కలిగించే విషయంగా తయారైంది. అలాగే ప్రధాన రాజకీయ సమస్యగానూ మారింది. గ్యాస్ ధరలపై అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్షాలు విమర్శించడం, ఆందోళనలు చేయడం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా సామాన్యులపై పెట్రోల్‌, ఎల్‌పిజి ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎల్పీజీ వినియోగదారులకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాయితీలను అందిస్తున్నాయి. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన పేద, మధ్య తరగతి వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే 12 సిలిండర్లను అందజేస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో, గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం అందించే రాయితీని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..