TVS X Electric Scooter: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభం..ముందుగా ఆ సిటీ వాళ్లకే చాన్స్..!
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్ మోటారు కంపెనీ శుభవార్త చెప్పింది. కస్టమర్లకు తన ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభించింది. మొదటి సెట్ యూనిట్లను బెంగళురులో ఖాతాదారులకు అందజేసింది. టీవీఎస్ కంపెనీ 2023 ఆగస్టులో ఈ మోడల్ ను విడుదల చేసింది. అనంతరం ఖాతాదారులకు ఇప్పుడు వాహనాన్ని అందించింది. ఈ స్కూటర్ ధరను రూ.2.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్దారణ చేశారు. దేశంలోని అత్యంత ఖరీదైన ఇ-స్కూటర్లలో ఇది ఒకటి.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. సాధారణ వాహనాలకు బదులు వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్ట పడుతున్నారు. పట్టణాల్లో అయితే దాదాపు ప్రతి ఇంటిలోనూ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తోంది. అలాగే మహిళలు, పురుషులు, యువత అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. అత్యధిక రేంజ్, మంచి పికప్, బెస్ట్ ఫీచర్లతో విడుదలవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్ ఎక్స్ స్కూటర్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొదట లుక్స్ పరంగా అదరహో అనిపిస్తుంది.
టీవీఎస్ ఎక్స్ యాంగ్యులర్ బాడీ వర్క్ తో కూడిన అగ్రెసివ్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్, స్పోర్టీ స్టాన్స్ బాగున్నాయి. నిలువుగా ఉండే ఎల్ఈడీ హెచ్ ల్యాంప్, షార్ప్, స్ప్లిట్ అప్ ఫ్రంట్ ఆప్రాన్ ను కలిగి ఉంది. దీనిలో 4.44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక్క సారి ఫుల్ చార్జింగ్ చేస్తే దాదాపు 140 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 10.25 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. దీనికి స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. నావిగేషన్, కాల్స్, ఎస్ఎంఎస్ అలెర్ట్, రియల్ టైమ్ వెహికల్ డయాగ్రోస్టిక్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే స్కూటర్ కదలనప్పుడు, సైడ్ స్టాండ్ పై వాహనం ఉన్నప్పుడు వీడియోలను చూడటానికి, సంగీతం వినడానికి, గేమ్ లు ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే.. సస్పెన్షన్ డ్యూటీలు, యూఎస్ డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్, 220 ఎంఎం ఫ్రంట్, 195 ఎంఎం వెనుక డిస్క్ బ్రేకులు ఏర్పాటు చేశారు. దీనికి సింగిల్ చానల్ ఏబీఎస్ మద్దతు ఉంది. తొలిసారిగా బెంగళూరులో కస్టమర్లకు ఈ బండి డెలివరీలు అందజేశారు. దశల వారీగా మిగిలిన నగరానికి డెలివరీలు అందజేయాలని కంపెనీ భావిస్తోంది. టీవీఎస్ ఎక్స్ స్కూటర్ ను మూడు రకాల రైడింగ్ మోడ్ లతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎక్స్ టీత్, ఎక్స్ రైడ్, ఎక్స్ నోనిక్ అనే మోడ్ లతో వస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీని కేవలం 4.30 గంటల్లో 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు.