Gold Rate: బడ్జెట్ తర్వాత బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న గోల్డ్, సిల్వర్ రేట్స్
పగ్గాలే లేనట్టుగా పరుగులు పెడుతోంది బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయంగా ట్రంఫ్ ఎఫెక్ట్.. దేశీయంగా రూపీ పతనంతో కొత్త రికార్డులను తాకుతోంది గోల్డ్ రేట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లో బంగారానికి సంబంధించి సవరణలు చేయకపోవడంతో బులియన్ మార్కెట్‌లో జోరు కొనసాగుతోంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను శనివారం(ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో బంగారానికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, శనివారం బడ్జెట్ రోజున, బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,900కి అమ్ముడవుతోంది. ఇది స్వర్ణం ఆల్‌టైమ్ రికార్డ్. నిన్నటితో పోల్చితే రూ.1,100 పెరిగింది. ఇది వరుసగా మూడో రోజు పెరుగుదల నమోదు చేసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, బంగారం 10 గ్రాములకు రూ. 79,390 వద్ద ఉంది. అప్పటి నుండి అది 7% అంటే రూ. 5,510 పెరుగుదల నమోదు చేసుకుంది. వెండి ధరలు కూడా 0.33% పెరిగి కిలో రూ.93,640కి చేరాయి.
గత ఏడాది జులైలో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో..బంగారం దిగుమతులు 104 శాతం పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23శాతానికి పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..