Uber one: ఉబర్ క్యాబ్‌లలో ప్రయాణం మరింత చౌక.. మెంబర్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో..!
ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఉబర్ కు దేశంలో మంచి ఆదరణ ఉంది. దీని ద్వారా పలు నగరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. వివిధ పనులపై నగరానికి వచ్చే వారితో పాటు స్థానికులు కూడా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. వేగంగా, సురక్షితం ప్రయాణం చేయాలనుకునే వారికి ఉబర్ క్యాబ్ ఎంతో బాగుంటుంది.
ఉబర్ యాప్ లో మీరు ఉన్న ప్రదేశం, మీరు వెళ్లాల్సిన చోటును నమోదు చేస్తే చాలు. నిమిషాల్లో క్యాబ్ మీ ముందు ఉంటుంది. చార్జీల వివరాలు, డ్రైవర్ సమాచారం అంతా తెలుస్తుంది. బేరం ఆడాల్సిన పనిలేకుండా చాలా తొందరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉబర్ తన ప్రయాణికులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడానికి ఉబర్ వన్ అనే మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. ఉబర్ కంపెనీ తన మెంబర్ షిప్ ప్రోగ్రామ్ అయిన ఉబర్ వన్ ను దేశంలో ఇటీవల ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా మిలియన్ల మంది రైడర్లకు పొదుపు ప్రయోజనాలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మెంబర్ షిప్ లో భాగంగా రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నెలకు రూ.149 లేదా ఏడాదికి రూ.1499 చెల్లించి వీటిని తీసుకోవచ్చు.
ఉబర్ వన్ మెంబర్ షిప్ తీసుకున్నవారు ఆ సంస్థ క్రెడిట్స్ కు అనుమతి పొందుతారు. ఒక ట్రిప్పుకు గరిష్టంగా రూ.150 వరకూ అందుతుంది. దీనితో పాటు జొమాటో గోల్డ్ కు మూడు నెలల కాంప్లిమెంటరీ సభ్యత్వం లభిస్తుంది. తరచూ ప్రయాణాలు చేసే వారికి, ఫుడ్ డెలివరీ సేవలను ఎక్కువగా ఉపయోగించుకునే వారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉబర్ గో, ప్రీమియర్, ఎక్స్ ఎల్, రిజర్వ్, ఆటో, మోటో, ఇంటర్ సిటీ, రెంటల్, షటిల్ తదితర అన్ని రైడ్ ల ఎంపికలు మెంబర్ షిప్ ప్రోగ్రామ్ లో అందుబాటులో ఉంటాయి. ఉబర్ వన్ మెంబర్ షిప్ తో కస్టమర్లకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఫోర్, త్రీ, టూ వీలర్ రైడ్ లపై పదిశాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే మీకు ప్రాధాన్యం కలిగిన కస్టమర్ గుర్తింపు లభిస్తుంది.
అత్యధిక రైటింగ్ ఉన్న డ్రైవర్లు అందుబాటులోకి వస్తారు. ఎలాంటి ఆందోళన లేకుండా సురక్షితంగా ప్రయాణం చేయడంతో పాటు ఖర్చులను పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది మన దేశంలో కొత్తగా ప్రారంభించినప్పటికీ కెనడా, అమెరికాలో ఇప్పటికే అమల్లో ఉంది. దేశంలో రైడ్ హెయిలింగ్ సర్వీస్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ రంగంలో ఉన్న ఉబర్, ర్యాపిడో తదితర సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. దీంతో ఉబర్ తమ కస్టమర్లకు అనేక ప్రయోజనాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది. సురక్షిత ప్రయాణం, భద్రత అందించేందుకు ఫీచర్లను తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఎస్ వోఎస్ ఇంటిగ్రేషన్, పిలియన్ రైడర్ల కోసం హెల్మెట్ సెల్ఫీ, మహిళా డ్రైవర్ల కోసం మహిళా రైడర్ ఫీచర్లు ప్రవేశపెట్టింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి