Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందా.. అయితే ఇలా చేస్తే రుణం రావడం ఖాయం..!
అవసరం ఏదైనా సరే.. డబ్బు కావాలంటే వెంటనే గుర్తుకొచ్చేది వ్యక్తిగత రుణమే(Personal Loan)...
అవసరం ఏదైనా సరే.. డబ్బు కావాలంటే వెంటనే గుర్తుకొచ్చేది వ్యక్తిగత రుణమే(Personal Loan). క్రెడిట్ స్కోరు(Credit Score:) తక్కువగా ఉన్నప్పుడు ఈ అప్పు తీసుకోవడం కష్టమే. ఇలాంటప్పుడు అదనంగా కొన్ని వివరాలు తెలియజేయడం ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు పరిస్థితులు మెరుగవుతాయి. క్రెడిట్ స్కోరు నివేదికలో కొన్నిసార్లు తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ముందుగా మీ నివేదికను నిశితంగా పరిశీలించి, అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా చూసుకోండి.
రుణ వాయిదాలన్నీ సరిగ్గానే చెల్లిస్తున్నా.. స్కోరు మెరుగ్గా లేదంటే.. ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లండి.అదనపు ఆదాయం ఉంటే: క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుకు మీ అదనపు ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఇందులో అద్దె ఆదాయం, ఇంక్రిమెంట్లలాంటివి ఉండొచ్చు. చెల్లించాల్సిన ఈఎంఐల కన్నా.. ఆదాయం అధికంగా ఉందని నిరూపిస్తే.. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణం మంజూరు చేసేందుకు అవకాశాలు ఉంటాయి.
తక్కువ క్రెడిట్ స్కోరున్నప్పుడు అధిక రుణం లభించడం కష్టమే. కాబట్టి, స్వల్ప మొత్తానికి రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల ఈఎంఐ సులువుగా చెల్లించేందుకు వీలవుతుందని బ్యాంకు విశ్వసిస్తుంది. ఇలా చిన్న వాయిదాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.
అధిక మొత్తంలో రుణం కావాలి అనుకున్నప్పుడు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయొచ్చు. ఇదీ కుదరకపోతే.. హామీగా ఎవరినైనా చూపించి, రుణం తీసుకునే వీలూ ఉంటుంది. సహ దరఖాస్తుదారులు, హామీగా ఉండేవారూ కేవైసీ పత్రాలు, ఆదాయానికి సంబంధించిన ఆధారాలను బ్యాంకుకు అందించాలి.