Investment Plans : మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకానికి సుకన్య సమృద్ధి పథకానికి మధ్య ప్రధాన తేడాలివే.. మీరు ఓ లుక్కెయ్యండి..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్ఎస్‌సీ) అని పిలిచే పెట్టుబడి మార్గం చిన్న పొదుపు పథకంలో భాగంగా కేంద్రం పేర్కొంటుంది. అయితే ఇప్పటికే బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ఈ పథకానికి తేడా ఏంటి?

భారతీయుల్లో పొదుపుపై ఆసక్తి పెంచడంతో పాటు మహిళలు ఆర్థిక భరోసా కల్పించిన 2023లో బడ్జెట్‌లో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త స్థిర-ఆదాయ పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్ఎస్‌సీ) అని పిలిచే పెట్టుబడి మార్గం చిన్న పొదుపు పథకంలో భాగంగా కేంద్రం పేర్కొంటుంది. అయితే ఇప్పటికే బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ఈ పథకానికి తేడా ఏంటి? వడ్డీ రేట్లు, వచ్చే రాబడికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అనే అంశాలను ఓ సారి తెలుసుకుందాం.
అర్హత
చట్టపరమైన సంరక్షకుడు/సహజ సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేని ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతాను తెరవవచ్చు. అయితే ఎంఎస్ఎస్‌సీ పథకంలో పెట్టుబడికి వయస్సుపై ఎలాంటి నిషేధం లేదు.
వడ్డీ రేటు
ఎస్ఎస్‌వైకు వర్తించే వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తారు. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంది. అయితే ఎంఎస్ఎస్‌సీ పథకంలో సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.



పదవీకాలం
సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే 15 సంవత్సరాల వ్యవధిలో క్రమం తప్పకుండా చిన్న మొత్తాలలో పెట్టుబడిని అనుమతించే దీర్ఘకాలిక పథకం. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది రెండు సంవత్సరాల కాలవ్యవధితో కూడిన స్వల్పకాలిక పథకం. అలాగే, ఈ పథకం ఏప్రిల్ 1, 2023 నుండి అందుబాటులో ఉంటుంది.
పెట్టుబడి పరిమితులు
ఎంఎస్ఎస్‌సీ పథకం గరిష్టంగా రూ. 2 లక్షల డిపాజిట్‌ను అనుమతిస్తుంది. మరోవైపు ఎస్ఎస్‌వై ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడిని అనుమతిస్తుంది. ఖాతాలో తదుపరి డిపాజిట్లను రూ. 50 గుణిజాలలో చేయవచ్చు. అయితే, ఒక నెలలో లేదా ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు. అలాగే ఈ రెండు పొదుపు పథకాలు ప్రభుత్వ మద్దతుతో ఉన్నాయి. అందువల్ల ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు.
అకాల ఉపసంహరణ
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అకాల ఉపసంహరణను అనుమతిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఎస్‌వై విషయంలో ఖాతాదారులకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
పన్ను ప్రయోజనాలు ఇలా
ఎంఎస్ఎస్‌సీ పథకానికి పన్ను ప్రయోజనాన్ని ఇంకా ప్రకటించలేదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచితీసివేయవచ్చు. సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీపై మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది..
ఏది మంచిది?
రెండు పథకాల మధ్య ఎంపిక వ్యక్తిగత ప్రాధాన్యతలు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్వల్పకాల పెట్టుబడి మార్గం కోసం చూస్తున్న వారికి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అయితే సుకన్య సమృద్ధి యోజన దీర్ఘకాలిక పెట్టుబడులకు మరింత అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి




