AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ సొమ్మును తిరిగి రికవరీ చేసుకోవచ్చా..? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?

పీఎఫ్ నిధులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగికి ఊరట కల్పించేలా తీర్పు వెల్లడించింది. ఉద్యోగికి చెల్లించే పీఎఫ్ నిధుల్లో ఉల్లంఘనలు జరిగితే ఆ బాధ్యత యజమాని, ఈపీఎఫ్‌వో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉద్యోగికి సంబంధం ఉండదని తేల్చేసింది.

EPFO: ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ సొమ్మును తిరిగి రికవరీ చేసుకోవచ్చా..? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
Epfo
Venkatrao Lella
|

Updated on: Jun 16, 2026 | 9:02 AM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ సొమ్మును తిరిగి తీసుకోవడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. ఉద్యోగి నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో పీఎఫ్ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని కోరడం సరైన నిర్ణయం కాదని తేల్చేసింది. ఉద్యోగి చెల్లించే పీఎఫ్ సొమ్ములో ఏమైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ బాధ్యత యజమాని లేదా ఈపీఎఫ్‌వో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకానీ ఉద్యోగి నుంచి తిరిగి నగదును తీసుకునే హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. యజమానిపై చట్టపరంగా తీసుకునే హక్కు ఈపీఎఫ్‌వో ఉంటుందని, ఉద్యోగిపై కాదని తెలిపింది. అసలు దీనికి సంబంధించి అసలు వివరాల్లోకి వెళితే..

ఏం జరిగిందంటే..?

జెవి.నృపేందర్ రావు అనే ఉద్యోగి ఓ సంస్థలో పనిచేయగా.. ఆ సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. 1981 నుంచి ఈ ట్రస్ట్‌కు ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ హోదా ఉండేది. కానీ 2023 మార్చి 1న ఆ హోదాను సరెండ్ చేయగా.. 2023 జులై 21న నృపేందర్ రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ చెల్లించింది. అయితే మరో రూ.70 లక్షలు ఆయనకు రావాల్సి ఉంది. అయితే సదరు కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో కొంతమొత్తాన్ని యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఆర్బీఐ ఆదేశాలతో యస్ బ్యాంక్ బాండ్లు నిలిచిపోవడంతో.. ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు చేశారు. అయితే ఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత ఉద్యోగికి నేరుగా పీఎఫ్ బకాయిలు చెల్లించడం నిబంధనలను విరుద్దమని, ఉద్యోగి అందుకున్న సొమ్మును తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని 2025 ఫిబ్రవరి 17న ఈపీఎఫ్‌వో  రికవరీ నోటీసులు ఇచ్చింది.

ఉద్యోగికి ఊరట..

అయితే దీనిపై ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టి తాజాగా కీలక తీర్పు వెలువరించింది. పీఎఫ్ సొమ్ము అనేది ఉద్యోగికి చట్టబద్దంగా వచ్చే నిధులు అని, తిరిగి చెల్లించాలని కోరడం సరైనది కాదని పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా కంపెనీ, దాని ట్రస్ట్‌పైనే ఉంటుందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకానీ ఉద్యోగికి రికవరీ నోటీసులు జారీ చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. రికవరీ నోటీసులు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసులు జారీ చేయకపోవడం, వ్యక్తిగత విచారణకు పిలకపోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీంతో ఈపీఎఫ్‌వో జారీ చేసిన రికవరీ నోటీసులు ఈపీఎఫ్‌వో రద్దు చేసింది. ఈ విషయంలో యాజమాన్యం, ట్రస్ట్‌పై చర్యలు తీసుకునే హక్కు ఈపీఎఫ్‌వోకు ఉంటుందని తేల్చింది.

Follow Us