సామాన్య ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు!
ఎక్కడో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదరబోతున్న ఒక శాంతి ఒప్పందం.. ఇక్కడ భారతదేశంలోని సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను, మీ బైక్ పెట్రోల్ ఖర్చును, ఆఖరికి మీ ఇంటి లోన్ ఈఎంఐని కూడా మార్చేయబోతోందా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. గల్ఫ్ రీజియన్‌లోని కీలకమైన హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోబోతుండటంతో చమురు ధరలు దిగి రానున్నాయి. దీంతో మన దేశంలో వేటి ధరలు తగ్గనున్నాయో చూద్దాం.

అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రంపై అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదరబోతున్న శాంతి ఒప్పందం, సుదూర దౌత్య పరిణామంగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం నేరుగా సామాన్య భారతీయుడి జేబుపై పడనుంది. భారతదేశ ముడి చమురు దిగుమతులలో దాదాపు 60 శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గి, రవాణా సాధారణ స్థితికి వస్తుందనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే 4 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన దిగుమతిదారులలో ఒకటైన భారతదేశానికి ఈ పరిణామం ఐదు రకాలుగా భారీ ఊరటను ఇవ్వనుంది.
ఇరాన్-అమెరికా శాంతి ఛర్చలు భారత్‌పై చూపే ప్రభావం
పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్
భారతదేశం దాదాపు 85 శాతానికి పైగా ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడి ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లిస్తూ వచ్చిన భారీ రిస్క్ ప్రీమియం భారం ఇకపై తగ్గనుంది. అలాగే ఇరాన్‌పై ఆంక్షలు సడలిస్తే మార్కెట్లోకి అదనపు చమురు సరఫరా రానుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడమే కాకుండా, రానున్న రోజుల్లో ధరల పెంపుదలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
దిగిరానున్న విమాన ప్రయాణ ఛార్జీలు
ఎయిర్‌లైన్స్ కంపెనీల నిర్వహణ ఖర్చులలో ఎక్కవ శాతం విమాన ఇంధనానికే ఖర్చు అవుతుంది. ఈ శాంతి చర్చల కారణంగా చమురు ధరల తగ్గుదలతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గనున్నాయి. తద్వారా విమానయాన సంస్థలు ఛార్జీలను తగ్గించడానికి లేదా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో దేశీయ విమాన ప్రయాణాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, అలాగే గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం వల్ల విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
వంటగదిపై తగ్గనున్న ద్రవ్యోల్బణం భారం
నిజంగానే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎదుకంటే వాటిని రవాణా చేసే ట్రక్కుల రవాణా వ్యయం తగ్గుతుంది. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల నుండి దిగుమతి అయ్యే యూరియా సరఫరా మెరుగుపడటంతో వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. దీని వల్ల గత కొన్నాళ్లు స్థిరంగా ఉన్న నిత్యావసర వస్తువు తగ్గి నెల వారి ఇంటి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.
గ్యాస్ సిలిండర్ ధరల స్థిరీకరణ
హార్ముజ్ జలసంధి మళ్లీ ఓపెన్ అవ్వడం కేవలం ముడి చమురుతో పాటు ఎల్‌పీజీ (LPG), సహజ వాయువు ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా విపరీతంగా పెరిగిన షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గడం వల్ల, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను స్థిరంగా ఉండే ఛాన్స్ ఉంది.
తగ్గనున్న లోన్ ఈఎంఐలు
ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, సామాన్యుడికి లభించే అతిపెద్ద పరోక్ష ప్రయోజనం బ్యాంక్ లోన్ల రూపంలో ఉంటుంది. ఇంధన ధరలు తగ్గితే దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించేందుకు మొగ్గు చూపుతుంది. దీనివల్ల సామాన్యుల హోమ్ లోన్లు, కార్ లోన్ల నెలవారీ ఈఎంఐలు తగ్గి, జేబుకు మరింత ఊరట లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




