బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల పోరాటం ఊహించని మలుపు తిరిగింది. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారంటూ.. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

మహిళా రెజ్లర్లు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసులో మాజీ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను కూడా న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపడంలో పూర్తిగా విఫలమైందని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తన తీర్పులో తెలిపారు. WFI చీఫ్‌గా ఉన్న సమయంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో దేశంలోనే ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు పూర్తి చేసి 2023 జూన్ 15న దాదాపు 1,500 పేజీల సుదీర్ఘ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
ఆ రోజే చెప్పాను..
ఆరుగురు మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌లు దాదాపు మూడున్నరేళ్ల పాటు న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో ఇన్‌కెమెరా పద్ధతిలో ఇరువర్గాల తుది వాదనలను క్షుణ్ణంగా విన్న కోర్టు, తాజాగా తుది తీర్పును వెలువరించింది. తీర్పు వెలువడిన అనంతరం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నాపై ఆరోపణలు వచ్చిన రోజే స్పష్టంగా చెప్పాను.. ఈ ఆరోపణల్లో ఒక్కటి నిజమని తేలినా స్వచ్ఛందంగా ఉరి వేసుకుంటానని అన్నాను. నేడు గౌరవప్రదమైన రీతిలో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించండంతో సత్యమే గెలిచింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న రెజ్లర్లు
ట్రయల్ కోర్టు బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పుపై బాధితుల తరఫు న్యాయవాదులు పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ త్వరలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు బాధితుల లీగల్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం మరోసారి ఉన్నత న్యాయస్థానంలో చర్చనీయాంశంగా మారనుంది.
