గన్ ఫైరింగ్ లో ఇరాన్ మహిళలు ట్రైనింగ్! అమెరికా భూతల దాడులను తిప్పికొట్టేలా..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో టెహ్రాన్‌లో మహిళలకు తుపాకీల వాడకంలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. టెహ్రాన్‌లోని ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంలో మహిళలు పాల్గొన్నారు. సైనిక అధికారులు, శిక్షకులు వారికి ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం తుపాకులను ఎలా పట్టుకోవాలి? ఎలా ఉపయోగించాలి? ఎలా కాల్చాలి? అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అందులో హ్యాండ్‌గన్స్ కూడా ఉన్నాయి.

టెహ్రాన్‌లో అనూహ్య దృశ్యాలు.. చేతుల్లో తుపాకులు పట్టుకున్న సాధారణ మహిళలు! అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ పౌరులకు సైనిక శిక్షణ కేంద్రాలను తెరిచింది. మహిళలకు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో నేర్పిస్తోంది. దీంతో అసలు ఇరాన్‌లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
మహిళల కోసం సైనిక శిక్షణా కేంద్రాలు
టెహ్రాన్‌లోని హఫ్తె తిర్ స్క్వేర్‌లో మరో పౌర సైనిక శిక్షణ కేంద్రాన్ని ఇరాన్ ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులకు దిగితే.. పరిస్థితులను ఎదుర్కొనేలా సాధారణ పౌరులను సిద్ధం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇప్పటిదాకా డ్రోన్లు, క్షిపణులు, వైమానిక దాడులకు పరిమితమైన యుద్ధంలో ఇప్పుడు భూతల దాడులు జరిగే అవకాశం ఉందన్న భయాలను ఇరాన్ సమాజం ఎదుర్కోంటోంది.
‘కుటుంబాన్ని కాపాడుకోవాలి’
యుద్ధ పరిస్థితులు వస్తే తమ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే తన భయం కొంత వరకు తగ్గుతుందని భావించి శిక్షణ తీసుకున్నట్లు 45 ఏళ్ల రహేలెహ్ ఘదీరి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబాలను రక్షించుకునేందుకు మహిళలు సైనిక శిక్షణకు ముందుకొస్తున్నారు.
ట్రంప్ హెచ్చరికతో ఉత్కంఠ
ఇరాన్ విషయంలో అమెరికా అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంకేతం ఇచ్చారు. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. నవంబర్ నాటికి సుమారు 10 వేల మంది అదనపు సైనికులను, మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తో పాటు పలు నావికాదళ నౌకలను అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికా తర్వాతి అడుగు ఏమిటన్న దానిపై ఉత్కంఠ పెరిగింది. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికా, దాని మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే.. గతంలో కంటే మరింత బలంగా ప్రతిఘటించి తమ దేశాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. న్యాయం, సమానత్వం ఆధారంగా జరిగే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని అన్నారు.
ఇరాన్‌లో ఏం జరగబోతోంది?
ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం క్రమంగా గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారాల్లో అమెరికా.. ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్లు, పోర్టులను లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణి దాడులు చేపట్టింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగి.. ఆ ప్రాంతం మరో పెద్ద యుద్ధం దిశగా వెళ్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.